పోలవరం నిర్మాణ పనుల తీరుపై తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అది గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత అవుతుందనే అక్కస్సుతోనే వైకాపా నేతలు ఆలస్యం చేస్తున్నారని టీడీఎల్పీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఈ కారణంతోనే పనుల్లో జాప్యం చేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలను 55 వేల కోట్ల రూపాయలు పెంచామంటున్న వైకాపా ప్రభుత్వం... అంత కంటే తక్కువ మొత్తానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలదా అని ప్రశ్నించారు. 72 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పోలవరం పనులు స్తంభింపజేసి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలనే తపన విజయసాయిరెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.
వైకాపా నేతల వ్యాఖ్యలు దారుణం
పట్టిసీమ మోటార్లు పీకేస్తామని వైకాపా నేతలు అనటాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎవరూ హర్షించరన్నారు. పట్టిసీమ వల్ల గింజ కూడా పండలేదని వైకాపా నేతలు వ్యాఖ్యనించడం దారుణమన్నారు.
ఇదీ చదవండి
పోలవరం ప్రాజెక్టులో అవతకతవకలు జరిగినట్టు ఫిర్యాదుల్లేవు: కేంద్రం