రైతులకు విత్తనాలు పంచామని చెబుతున్న ప్రభుత్వం.. వేల కోట్ల రూపాయలు అవసరమైన హామీలను ఎలా ఇచ్చిందని పాలకొల్లు తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. పదేళ్ల క్రితం లాఠీ దెబ్బతింటేనే రైతులకు విత్తనాలను ఇచ్చేవారని ఇప్పుడూ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొందని అన్నారు. గతంలో మాదిరి పోలీస్‌స్టేషన్‌లో విత్తనాలు పంచే దుస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరారు. జులై 15లోగా వేరుశనగ విత్తనాలు నాటకపోతే దిగుబడి రాదని.. ప్రత్యామ్నాయంగా రైతులకు ఇతర విత్తనాలనైనా పంపిణీ చేయాలని సూచించారు. ఏ పంటలు వేయాలనే దానిపై వ్యవసాయశాఖ కసరత్తు చేయలేదని... విత్తనాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతోందని రామానాయుడు విమర్శించారు.
తెదేపా విధానాలే కారణం... శ్రీకాంత్
రామానాయుడు మాటలకు శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి తెదేపా ప్రభుత్వమే కారణమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. "కరవుపై చర్చ చేపడితే పక్కదారి పట్టిస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా చేపడుతున్నాం. రైతులకు ఉపశమనం కలిగించాలని పథకం చేపడుతున్నాం. విత్తనాల పంపిణీ ప్రక్రియ నవంబర్‌లోనే ప్రారంభించాలని.. తెదేపా ప్రభుత్వం ఆ పని చేయలేదు. మే నాటికి విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉన్నా చేయలేదు. పంటలు ఎండిపోతున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారు" అని మండిపడ్డారు. పంటలు ఎండిపోవడానికి ఎవరు కారణమని నిలదీశారు. గత ప్రభుత్వం రెయిన్ గన్‌లు ఇచ్చిన చోటే పంటలు ఎండిపోయాయని అన్నారు. రైతులపై ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. రైతులకు కచ్చితంగా అండగా ఉంటామని... ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.