ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు రెవెన్యూశాఖ కసరత్తు ప్రారంభించింది. వందేళ్ల క్రితం సర్వే చేసిన భూవివరాల్లో చాలా మార్పులు వచ్చినందున... సరిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక అంశాలను అధికారుల ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుని రీసర్వే చేపట్టాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది.
కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి లేకుండా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. బదిలీల పరంగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైనవిగా పేరొందిన విశాఖ, మధురవాడ, భీమిలి, విజయవాడ పటమట, గుణదల, విజయవాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు.... కొత్తగా సర్వీసులోకి వచ్చిన అధికారులను నేరుగా నియమించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. బదిలీల నుంచి ఈ 6 కార్యాలయాలను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యాలయాల్లో పోస్టింగ్ కోసం పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశాకు చిక్కిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యత లేనిచోట పోస్టింగులు ఇవ్వాలని నిశ్చయించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం... అవసరమైన చోట రెవెన్యూ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ భూరికార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీకి దాదాపు 15 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అవసరాల కోసం 25 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది.
విశ్రాంత అధికారులతో కూడిన కమిటీలు వేసి, జిల్లాల్లో 22A ద్వారా వచ్చిన భూవివాదాల్ని ఎక్కడికక్కడ పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.