వైకాపా అధ్యక్షుడు జగన్.. హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేర్వేరుగా కలిశారు. ప్రగతి భవన్లో కేసీఆర్ ను సతీసమేతంగా కలిశారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పనిచేద్దామని కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా.. తెరాస నేతలను, మంత్రులను జగన్ కు పరిచయం చేశారు. కేసీఆర్ తో పాటు, కేటీఆర్.. జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
అంతకుముందు.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్... నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. గవర్నర్ తో గంటపాటు సమావేశమయ్యారు. జగన్ రాకకు ముందే రాజ్‌భవన్‌కు చేరుకున్న వైకాపా కీలక నేత బొత్స సత్యనారాయణ... జగన్‌ను వైకాపా శాసనసభపక్షనేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా.. బేగంపేట విమానాశ్రయం, రాజ్‌భవన్ వద్ద వైకాపా నేతలు, జగన్ అభిమానులు సందడి చేశారు.
హైదరాబాద్ పర్యటనలో.. జగన్ వెంట వైకాపా అగ్ర నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఉన్నారు.
ఇదీ చదవండి...