రాష్ట్రంలో మరో రెండురోజుల్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ఈనెల 8న మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేయడంతో... ముఖ్యమంత్రి పిలుపు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాలు, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని అమాత్యుల జాబితా జగన్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ లేదా ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. పాముల పుష్పశ్రీవాణి... రాజన్న దొర పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇరువురిలో ఒకరికి మంత్రిపదవి దక్కే అవకాశం ఉంది. విశాఖ జిల్లా నుంచి అవంతికి బెర్త్ ఖాయమైనట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు... ఎస్సీ కోటాలో గొల్ల బాబూరావు... కాపు వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది.
తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో విశ్వరూప్‌కు అవకాశం దక్కొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కాపు సామాజికవర్గం నుంచి కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజాలో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసాదరాజుకు అమాత్య పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆళ్లనాని, గ్రంథి శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఒకరికి పదవి దక్కవచ్చు. ఎస్సీ కోటాలో కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత... పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లాలో కొడాలి నాని పేరు ఖరారైనట్లేనని తెలుస్తోంది. బీసీల్లో యాదవ సామాజికవర్గానికి చెందిన పార్థసారథికి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. కాపు కోటాలో పేర్నినాని పేరు వినిపిస్తోంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు పరిశీలనలో ఉంది. గుంటూరు జిల్లాలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డికి మంత్రిపదవి ఇస్తానని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. వీరిరువురికి పదవులు ఖాయమేనని తెలుస్తోంది. ఎస్సీ మహిళ కోటాలో సుచరిత పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రిపదవి ఖాయమైనట్లే. ఎన్నికల సభలోనే జగన్ హామీ ఇచ్చినందున ఆయనకు మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఎస్సీ కోటాలో ఆదిమూలపు సురేశ్‌కు అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డితోపాటు... నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి అవకాశం దక్కనుంది. అనిల్‌కుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు జిల్లాలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అవకాశం కల్పించవచ్చు.
కడపలో మేడా మల్లికార్జునరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. ముస్లిం కోటాలో అంజాద్ బాషకు దక్కొచ్చని తెలుస్తోంది. ఎస్సీ కోటాలో కోరుముట్ల శ్రీనివాసులు రేసులో ఉన్నారు. అనంతపురం జిల్లాలో శంకర నారాయణ పేరు పరిశీలనలో ఉంది. అనంత వెంకట్రామిరెడ్డికి లేదా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి ఖాయమే. భూమన కరుణాకరరెడ్డి, రోజా పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఇదీ చదవండీ... కేశినేని అలక... ఫేస్బుక్లో వ్యంగ్యాస్త్రాలు