వేసవిలో దాహం తీరాలని శీతల పానీయాలు, చెరకు, పళ్ల రసాలు తాగేస్తుంటారు. అవి ఎక్కడ తయావుతున్నాయి. అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా గొంతులో పోసేసి... దాహార్తి తీర్చుకుంటారు జనం. ఈ అలవాటే ప్రజల ప్రాణాలు తీసే ఆయుధం అయి కాన్సర్‌కు కారణమవుతోందని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విశాఖలో శీతలపానియాలు తయారీ కేంద్రాల్లో వారు చేసిన దాడుల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. 'ఈ పానీయాల్లో వినియోగించే మంచుగడ్డలు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యంగా తయారుకావడం లేదు. ఐస్ తయారీకి శుద్ధి నీరూ వినియోగించడం లేదు. చేపలు, మృతదేహాల నిల్వకు ఉంచే ఐస్‌నే వాడుతున్నారు" అని అధికారులు వెల్లడించారు. ఐస్ తయారీదారుల చర్యలతో ఈకోలీ బాక్టీరియా వ్యాప్తి చెందుతోందని... ఇది వినియోగించి తయారు చేసే పండ్ల రసాలు తాగడం వల్ల కాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు.
తాగేముందు ఆలోచించండి
వినియోగదారుల ఫిర్యాదులతో ఐస్ కర్మాగారాలపై విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టి పెట్టారు. పలు చోట్ల సోదాలు చేసి... పరీక్షలు జరిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు. నిరంతరం ఈ దాడులు చేస్తామని చెబుతున్నారు అధికారులు. బయట పానీయాలు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.