వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 12న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈమేరకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... ముఖ్యమైన పథకాలకు తగిన కేటాయింపులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 2 రోజుల పాటు అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమైన ఆర్థికమంత్రి... ఆయా శాఖల అవసరాలపై చర్చించారు. మొదటిరోజు రోడ్లు- భవనాలు, రవాణా, పశుసంవర్థక శాఖ, మార్కెటింగ్, పర్యాటక, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, గిరిజన సంక్షేమం, గృహనిర్మాణ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. రెండో రోజు విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, హోం, రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయితీరాజ్, పురపాలక మంత్రులు, అధికారులతో సమీక్షించి.... వారి ప్రతిపాదనలు తీసుకున్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో 12వేల 713 కోట్ల 90 లక్షల రూపాయలు కేటాయించాలని... ఆర్థికశాఖకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. శాఖలవారీ సమీక్షలు పూర్తిచేసిన ఆర్థికమంత్రి... ఆయా ప్రతిపాదనలపై సీఎంతో చర్చించి, ఏ శాఖకు ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించే అవకాశం ఉంది.
ఈసారి బడ్జెట్‌లో వైకాపా హామీల్లో ప్రధానమైన నవరత్నాలకు కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగన్ పాదయాత్ర సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వివిధ వర్గాల ప్రతిపాదనల ఆధారంగా నవరత్నాలకు రూపమిచ్చారు. అధికారంలోకి రాగానే అమలుకు చర్యలు చేపట్టారు. అందువల్ల బడ్జెట్‌లో నవరత్నాలే కీలకంగా ఉండేలా చూస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. అమ్మఒడి అమలు, బోధనా ఫీజులు, రైతుభరోసా, ఉద్యోగుల మధ్యంతర భృతికి తగిన కేటాయింపులు చేయనున్నారు.