ఒకేసారి 25 మంది ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలకు తగినట్లుగా ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటించారు. ప్రాంతాల వారీగానూ కొంత చతురత ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి , కృష్ణా జిల్లాలకు అత్యధికంగా జిల్లాకు 3 చొప్పున 9 స్థానాలు దక్కాయి. తొలిసారి పట్టుచిక్కిన ఈ జిల్లాల్లో... దానిని మరింత పదిలం చేసుకునేందుకు ప్రయత్నించారన్న భావన వ్యక్తమవుతోంది. తెదేపాకు ఒక్క స్థానమూ దక్కని విజయనగరం , నెల్లూరు ,కర్నూలు జిల్లాలకు రెండేసి పదవులు కట్టబెట్టారు. కడప జిల్లా నుంచి స్వయంగా ముఖ్యమంత్రి ఉండగా మైనారిటీ వర్గానికి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్కరే ఉన్నా శాసన సభాపతి స్థానాన్ని ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు అవకాశం ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. అనంతపురం , విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరినే ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
వర్గ న్యాయం
మంత్రి పదవుల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన కోన రఘుపతికి ఉప సభాపతి పదవి ఇస్తున్నట్లు సమాచారం. ఈవర్గానికి కేబినెట్ పదవి దక్కలేదు. అత్యధికులు గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ పదవులు ఉంటాయని నేతలు భావించినా అలా జరగలేదు.నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆ వర్గానికి సమాన స్థాయిలో ఉండే కాపులకూ నాలుగు పదవులు ఇచ్చారు. బలహీన వర్గాలకు అత్యధికంగా 7 స్థానాలు దక్కాయి. ఎస్సీ , మైనారిటీ వర్గాల కు ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఎస్సీలకు 5 అమాత్య పదవులు లభించగా.. అత్యధిక సంఖ్యాకులు ఉన్న మాలలకు 3 మాదిగలకు 2 చొప్పున లభించాయి. ఇలా చేయడాన్ని రాజకీయ వ్యూహంగా పరిగణిస్తున్నారు.
పట్టు కోసం నాలుగు జిల్లాలకు
విశాఖపట్నం నుంచి కృష్ణా వరకు తెలుగు దేశం పార్టీ దాదాపు సగం సీట్లు ఈ నాలుగు జిల్లాల్లోనే ఉండటం విశేషం. జనసేన పార్టీ అత్యధికంగా ఓట్లు సాధించిన ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మెట్ట ప్రాంతంగా పేరుపడిన చోట అసలు ప్రాతినిథ్యమే లేకపోవడం విశేషం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి అవకాశం రాలేదు.
విశ్వాసానికి పదవి
చిరకాలంగా తనను నమ్ముకుని ఉన్న వారికి మంత్రిపదవుల పంపిణీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి ఓడిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినా అమాత్య పదవులు ఇచ్చారు.
దక్కని పదవి
మంత్రి పదవుల్లో ప్రాంతాలు , సామాజిక వర్గాల ప్రాతిపదికగా చేయడంతో కొంత మంది సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. తొలి నుంచీ వైకాపాలో ఉన్న ధర్మాన సోదరుడైన ధర్మాన కృష్ణదాస్ కి అవకాశం కల్పించడంతో ధర్మాన ప్రసాదరావుకు అవకాశం రాలేదు.
ప్రకటించినా దొరకని వరం
గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తా మని బహిరంగంగా ప్రకటించిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి కి మాత్రమే అవకాశం లభించింది. మిగిలిన వారైన ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ లను ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత పదవుల్లో అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నవరత్నాలు హామీ అమలుకు సంబంధించి న పదవులకు పరిశీలిస్తున్నట్లు సమాచారం.