ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు భద్రత విషయంలో ఎలాంటి రాజీ ధోరణికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియామవళిని అనుసరించి వ్యవహరించాల్సి ఉంటుందని ఈసీఐ సూచించింది.
కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పాదర్శకంగా, పటిష్ఠంగా చేపట్టాలని..వాటిపై ప్రణాళిక విభాగం రూపొందించిన మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలని తేల్చి చెప్పింది. ఓటింగ్ యంత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి రోజూ రెండు పర్యాయాలు సంబంధిత డీఈవోలు ఆయా కేంద్రాలను తనిఖీ చేసి, వీడియో రికార్డింగ్ చేయాలని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
సువిధలో అనుసంధానం
వీవీ ప్యాట్ల లెక్కింపు సందర్భంలో ఆయా నియోజకవర్గ పరిధిలోని సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు అనుగుణంగా టేబుళ్లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని సూచించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో మాత్రమే నియమించాలని తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపులో భాగంగా సంబంధిత వివరాలు ఈసీఐ అధికారిక పోర్టల్.. న్యూ సువిధలో అనుసంధానం చేసి రాజకీయపార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తరవాతే ఫలితాలు ప్రకటించాలని స్పష్టం చేసింది.