రైతులకు ఆర్థికంగా చేయూత నిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలుకు వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి రైతులకు మరింత ప్రయోజనం సమకూరేలా చేయాలని స్పష్టం చేశారు.
ఉద్యానవన శాఖే కీలకం
ఈ పథకం అమలులో ఉద్యానవన శాఖ నోడల్ వ్యవస్థగా పనిచేయాలని సూచించారు. ఉద్యానవన రైతులు ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని పంట దిగుబడిలో వృద్ధి సాధించడానికి కృషి చేయాలని సీఎస్ సూచించారు. తోటల పెంపకంలో వినియోగించే బోర్లన్నింటినీ పునరుద్ధరించి...భూగర్భ జలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అభ్యున్నతికి దోహదం
పీఎంకెఎస్వైతో ఎస్సీ,ఎస్టీ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఈ పథకాన్ని ఆహారశుద్ధి పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే రీతిలో వినియోగించాలని సీఎస్ అన్నారు. పథకం అమలు తర్వాత ఎంత మంది రైతుల జీవన విధానాల్లో పురోగతి వచ్చింది... ముఖ్యంగా వ్యవసాయ, సేవల రంగాల్లో వీటి ప్రభావం ఎలా ఉందనే అంశాలపై అధ్యయనం చేయాలని సుబ్రహ్మణ్యం సూచించారు.
కేటాయింపులు
రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యత ఉందన్న సీఎస్..ఆ దిశగా ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. 2018-19 సంవత్సరంలో కిసాన్ సమ్మాన్ ద్వారా వ్యవసాయశాఖకు రూ.100 కోట్ల కేటాయించారని గుర్తుచేశారు. ఇందులో సుమారు రూ.70 కోట్లు వినియోగించామని వ్యవసాయ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 80 వేల హెక్టార్లకు నీటి సదుపాయం కల్పించి..48 వేల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు.
ప్రణాళికలు
నీటి సంరక్షణ, వాటర్ హార్వెస్టింగ్, బిందు సేద్యం, చెక్ డ్యాంల నిర్మాణం, బోర్ల ఏర్పాటు, పునరుద్ధరణ వంటి పనుల నిర్వహణతో రైతులకు ప్రయోజనం కల్పించామని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
2018-19 ఏడాదికి సంబంధించి వివిధ జిల్లాల్లో రూ.410 కోట్ల అంచనాతో 370 వాటర్ షెడ్ పథకాలు చేపట్టిన పనుల్లో ఇప్పటికే 60శాతం పూర్తి చేశామన్నారు. మైనర్ ఇరిగేషన్ పథకాల కింద 2 లక్షల 96 వేల 577 హెక్టార్లకు సాగునీరు అందించేందుకు రూ.4270 కోట్ల వ్యయంతో 8 ప్రాజెక్టులు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు వివరించారు.
ఇవీ చూడండి : ఎన్నికల సంఘానికి... మంత్రివర్గ సమావేశ అజెండా!