ఎన్నికల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారనే ఫిర్యాదుకు ఆస్కారం లేని రీతిలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని.. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపించరాదని అధికారులను హెచ్చరించారు.
పోలింగ్‌కు ఇంకా 4 రోజుల్లో సమయం ఉన్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం వంటివి పంపిణీ చేసేందుకు చేసే ప్రయత్నాలు సమర్థవంతంగా నియంత్రించాలని దిశానిర్దేశం చేశారు.
జిల్లాల్లో మోడల్ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి నమోదయ్యే ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటికి సంబంధించిన గోదాములు, షోరూమ్‌లలో తనిఖీలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైనవిగా 25 నుంచి30 పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలను ఏవిధంగా సమర్ధవంతంగా నిర్వహించాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎస్ సూచించారు.
వృద్ధులు, వికలాంగులు, గర్భవతులు వంటి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఇవీ చూడండి.