కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక హోదాపై చర్చించినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం అమిత్ షాతో సమావేశమై.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై లేఖ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. విభజన చట్టంలోని హామీల అమలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అమిత్ షా దృషికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రధాని మోదీ మనసు కరిగించి హోదా ఇచ్చేలా చూడాలని కోరామని అన్నారు. విభజన హామీలు త్వరగా పూర్తి చేయాలని అమిత్ షాను కోరామన్నారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. వీటిని అధిగమించేందుకు కేంద్రం సహాయం కావాలని విజ్ఞప్తి చేసినట్లు సీఎం తెలిపారు. రేపు జరిగే నితి ఆయోగ్ సమావేశంలోనూ ఈ అంశాలు లేవనెత్తుతామని.. ప్రత్యేక హోదా అంశాన్నీ ప్రస్తావిస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉంటామని సీఎం స్పష్టం చేశారు.
డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపాదన ఏమీ రాలేదన్న జగన్.. అలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని కోరుతున్నామన్నారు.
అమిత్ షాతో భేటీలో వైకాపా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డితో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘరామ కృష్ణం రాజు, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.