Stella Ship Case Updates : కాకినాడ తీరంలో నెల రోజులుగా లంగరు వేసిన స్టెల్లా షిప్ భవితవ్యం అలలపై ఊగిసలాటలా ఉంది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఇందులో ఉన్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ప్రకటించినా, సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించినా చర్యల దిశగా మాత్రం అడుగులు పడలేదు. నౌక సీజ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంది దీంతో పాటు దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడంతో షిప్‌ను సీజ్ చేయడంకంటే అందులోని అక్రమ నిల్వలు సీజ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 15లోగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
హల్దియా నుంచి నవంబర్ 11న స్టెల్లా ఎల్ పనామా షిప్ కాకినాడ తీరానికి వచ్చింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి బియ్యం నిల్వలు ఈ నౌక ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా ఈ నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నారు. 32,415 టన్నుల బియ్యాన్ని షిప్‌లోకి ఎత్తిన తర్వాత ప్రతిష్టంభన నెలకొంది.
రేషన్ బియ్యం పశ్చిమ ఆఫ్రికాకు అక్రమంగా తరలిపోతోందన్న సమాచారంతో గత నెల 27న కలెక్టర్ షన్మోహన్ నౌకలో తనిఖీలు చేసి 650 టన్నుల పీడిఎస్ బియ్యం గుర్తించినట్లు ప్రకటించారు. 29న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించి ఇక్కడి అక్రమ ఎగుమతులు, భద్రత వైపఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీజ్ ద షిప్' అని ఆదేశించారు. దీంతో అక్రమ బియ్యం నిల్వలున్న స్టెల్లా ఎల్ నౌకతోపాటు ఇక్కడి రేషన్ మాపియా వ్యవహారం రచ్చకెక్కింది. అందరి దృష్టి కాకినాడ పోర్టు వైపు మళ్లింది.
Ration Rice Smuggling in AP : ఈ పరిణామాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ కేంద్రంగా గడచిన ఐదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాపియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో షిప్లో మరోసారి తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించింది. మరోవైపు బియ్యం అక్రమాల నిగ్గు తేల్చడానికి సిట్‌ను నియమించింది.
కాకినాడ యాంకరేజి పోర్టులోని లంగరు రేవు నుంచి బార్జిల్లో నిల్వలు తీసుకెళ్లి 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన షిప్‌ల వద్దకు లోడ్ చేయాలి. దీంతో ఈ ప్రక్రియకు 25 నుంచి 30 రోజుల గడువు తీసుకుంటారు. స్టెల్లా లోడింగ్‌కు తుపాను కొంత ఆటంకం కలిగించింది. ఈలోగా అక్రమాలు బయటకు పొక్కడంతో లోడింగ్ నిలిచిపోయి నౌక కదలికపైనే ప్రతిష్టంభన నెలకొంది. ఒప్పందం ప్రకారం మిగిలిన 19,785 టన్నుల బియ్యం ఎక్కించి పచ్చజెండా ఊపితేనే ఇది కదలే వీలుంది. లేదంటే డెమరేజ్ ఛార్జి రోజుకు 20,000ల డాలర్ల వరకు పడే అవకాశం ఉంది.
28 మంది ఎగుమతిదారులు కలిసి షిప్‌ను అద్దెకు తీసుకోవడం అందులో అక్రమ నిల్వలు ఉండడంతో ఎవరికివారు ఈ నష్టంపై పెద్దగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎగుమతిదారులు, కార్మికులు, ఇతరత్రా సంఘాల ఒత్తిడితో ప్రభుత్వమే వెనక్కి తగ్గుతుందన్న వేచిచూసే ధోరణితో ఉన్నారు. అధికారుల బృందం నౌకలో రెండోసారి సేకరించిన నమూనాలు వారం రోజులు దాటినా నేటికీ పరీక్షలకు పంపే చర్యలకు అడుగులు పడకపోవడంతో ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతోందన్న చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితే ఆక్రమార్కుల ధీమాకు కారణంగా కనిపిస్తోంది.
అక్రమ నిల్వలు సీజ్ చేయడం? : తాజా పరిస్థితులపై ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. షిప్ సీజ్ సాధ్యమేనా? ఈ చర్యలకు సాంకేతిక, ఇతరత్రా అడ్డంకులు ఉన్నందున నౌకలోని బియ్యం నిల్వలు సీజ్ చేసి షిప్‌ను వేరొక లోడ్‌తో పంపించే అంశం చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రేషన్ మాఫియాపై పకడ్బందీ చర్యలకు కొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకు స్టెల్లా నౌకను నిలువరించి వివాదం మరింత పెంచకుండా అందులోని అనుమానస్పద బియ్యం నిల్వలు దించేసి, షిప్‌ను ఇతర అధికారిక నిల్వలతో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
"సీజ్ ద షిప్" - పవన్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు - రెండ్రోజుల్లో రిజల్ట్!