నగరాలు కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న తరుణంలో పచ్చని చెట్ల స్థానంలో ఇళ్లు, అపార్టుమెంట్లు, కాలనీలు వెలుస్తున్నాయి. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో సాధారణం కంటే సరాసరి 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలులో ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో... పచ్చదనాన్ని పెంచితే కొంతవరకు ఉష్ణోగ్రతలు అదుపు చేయొచ్చని గుర్తించింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున 110 పట్టణాల్లో మొక్కలు నాటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా.. పచ్చదనం పురివిప్పేలా...
గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో మొక్కల పెంపకానికి అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలులోని కాలనీల్లో సామాజిక అవసరాలకు విడిచిపెట్టే పది శాతం ఖాళీ స్థలాల్లో లక్షా 17వేల 500 మొక్కలు నాటనున్నారు. ఈ మొక్కలు సరఫరా బాధ్యత పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రహదారులకు ఇరువైపులా లక్షా 70 వేల మొక్కలు నాటనున్నారు. వీటిని రాష్ట్ర హరిత, సుందరీకరణ సంస్థ సరఫరా చేయనుంది. ఇళ్ల ఆవరణలో, చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ముందుకొచ్చే వారందరికీ మరో 15 లక్షల 85 వేల మొక్కలు పంపిణీ చేస్తారు. తొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలోనూ మరో లక్షా 80 వేల మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇదీ చూడండి : విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు: అవంతి