చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో ఈసీని కలిసేందుకు దిల్లీ వెళ్లిన చంద్రబాబు.. తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవనున్నారు. అనంతరం సోనియా గాంధీని కూడా కలిసే అవకాశముంది. ఫలితాల తర్వాత వ్యూహాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం.
లఖ్‌నవూకు చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి 200 లోపు సీట్లు వస్తాయన్నది విపక్షాల అంచనా. మెజార్టీకి 70కి పైగా సీట్ల దూరంలో నిలిచిపోయే ఆ కూటమికి ప్రతిపక్షాలెవ్వరూ దొరక్కుండా వ్యూహం అమలు చేయడంతోపాటు, ఫలితాలు వెలువడిన వెంటనే విపక్ష కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవడానికి చంద్రబాబు ఈ మందస్తు కసరత్తు నిర్వహిస్తున్నట్లు రాజకీయం వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాయావతి, అఖిలేష్ భాగస్వామ్యం కీలకం. వారి మనసులోని మాటను తెలుసుకుని... తదనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు చంద్రబాబు శనివారం మధ్యాహ్నం లఖ్‌నవూ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
భాజపాను అడ్డుకునేందుకే...
ప్రస్తుతం ప్రధాని పదవి ఆశిస్తున్న వారిలో రాహుల్ గాంధీ, మాయవతి, మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు. కూటమి కట్టడానికి వీరు ముగ్గురు మినహాయిస్తే మిగిలిన పార్టీల నుంచి పెద్దగా ఇబ్బందులుండే అవకాశం లేదు. అందువల్ల వీరి మనోభావాలను తెలుసుకుని తదపరి వ్యూహ రచనతో ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తే... ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి వారినే పిలిచే అవకాశలుంటాయి. అలాంటి పరిస్థితులను ఎలా అడ్డుకోవాలో.. ముందస్తు వ్యూహంతో ఎలా వెళ్లాలో ఇవాళ చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండీ:మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్