ఫొని ప్రచండ తుపాను గమనం, ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా.. మరోసారి సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు. తీరం దాటే సమయంలో తుపాను ప్రభావం, సహాయ చర్యలను తెలుసుకున్నారు. సహాయక చర్యలకు సర్వ సన్నద్ధంగా ఉండాలని భారతీయ కోస్ట్ గార్డ్, నేవీతో పాటు.. విద్యుత్ విభాగ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి సీఎస్ వివరించారు. రక్షణ, సహాయ చర్యలు తీసుకున్నామన్నారు.
ఒడిశాలో 10 వేల గ్రామాలపై తీవ్ర ప్రభావం
ఒడిశాలో 10 వేల గ్రామాలు, 52 పట్టణాలపై తుపాను ప్రభావం ఉంటుందన్న ఆ రాష్ట్ర సీఎస్.. 900 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 లక్షల 30 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో రాత్రి నుంచి విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు తెలిపారు. పశ్చిమ బంగా రాజధాని కోల్‌కతాలో రేపు ఉదయం నుంచి విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎస్ వివరించారు.