రాష్ట్ర శాసనసభలో గమ్మతైన పరిస్థితి నెలకొననుంది. అదేంటంటే... శ్రీనివాస్ అని పేరెత్తితే చాలు ఏకంగా 13 మంది శాసనసభ్యులు తమరినే పిలిచారా అన్నట్టుగా స్పందించే పరిస్థితి ఏర్పడబోతోంది. అసలు విషయానికొస్తే... ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో శ్రీనివాస్ అనే పేరు గలవారు 13 మంది వరకు ఉన్నారు. ఇంత సంఖ్యలో ఒకే పేరు ఉన్న వారు గతంలో ఏ శాసనసభలోనూ లేరు.
175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఈసారి 13 మంది శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సభాపతి, ఉపసభాపతి సభలో ఉన్నవారు... శ్రీనివాస్ అని పిలిస్తే చాలు. ఎవరిని పిలిచారో తెలియక.. శ్రీనివాసులంతా తికమకకు గురయ్యే గమ్మత్తైన వాతావరణం.. ఇప్పుడు సభలో నెలకొంది. పూర్తి పేరుతో పిలిస్తే సరే... లేదంటే అలవాటులో పొరపాటుగా శ్రీనివాస్ అన్నారో అంతే.. 13 మంది లేచి తననేనా పిలిచింది అంటూ చేతులేత్తేలా కనిపిస్తోంది. ఇంత సంఖ్యలో శ్రీనివాస్ అనే పేరు ఎమ్మెల్యేలు ఉండటంతో సభాపతి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరమే. సభలో ఆ 13 మంది శ్రీనివాస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
⦁ ముత్తంశెట్టి శ్రీనివాసరావు - అవంతి శ్రీనివాస్(భీమిలి) - వైకాపా
⦁ బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు) - వైకాపా
⦁ కె.శ్రీనివాసరావు (శృంగవరపుకోట) - వైకాపా
⦁ పుప్పాల శ్రీనివాసరావు (ఉంగుటూరు) - వైకాపా
⦁ గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తరం) - తెదేపా
⦁ జి.శ్రీనివాసనాయుడు (నిడదవోలు) - వైకాపా
⦁ ఆరణి శ్రీనివాసులు (చిత్తూరు) - వైకాపా
⦁ వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ పశ్చిమం) - వైకాపా
⦁ గ్రంథి శ్రీనివాస్ (భీమవరం) - వైకాపా
⦁ కె.శ్రీనివాసులు (కోడూరు) - వైకాపా
⦁ చెల్లుబోయిన శ్రీనివాస్ (రామచంద్రపురం) - వైకాపా
⦁ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నర్సరావుపేట) - వైకాపా
⦁ ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(ఏలూరు) - వైకాపా
13 మంది శ్రీనివాసుల్లో.. ఒక్కరు తెదేపా ఎమ్మెల్యే కాగా...మిగతా 12 మంది వైకాపా సభ్యులు.