SP on student Amarnath murder: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో సంచలనం సృష్టించిన విద్యార్థి అమర్‌నాథ్ హత్య ఘటనలో పోలీసులు ఎట్టకేలకు నలుగురిని అరెస్టు చేశారు. శనివారం ముగ్గురిని పట్టుకున్నట్లు చెప్పిన పోలీసులు.. సాయంత్రానికి నాలుగో నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ కార్యకర్త కావడం, రాజోలు వైసీపీ ప్రాబల్యం ఉన్న గ్రామం కావడంతో కేసు తప్పుదారి పట్టిస్తున్నారనేఅనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఘటనకు సంబంధించి గ్రామ వాలంటీర్ రాంమూర్తి రెడ్డి చెప్పిన సాక్ష్యం తిరుగులేనిదిగా.. మారింది. అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిందితులు పారిపోయారు. అమర్నాథ్‌కు అంటుకున్న మంటలు.... అక్కడి మొక్కజొన్న బస్తాలపై వేసిన టార్పాలిన్ పట్టకు అంటుకున్నాయి. పొగలు చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన వారిలో వాలంటీర్ రాంమూర్తి కూడా ఒకరు..! అమర్నాథ్ తనతో ఏం మాట్లాడింది... ఘటన ఎలా జరిగింది... ఎవరు చేశారనే విషయాలను రాంమూర్తి పోలీసులకు చెప్పారు. దీంతో వారు హత్యకేసు నమోదు చేయక తప్పలేదు. ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ విషయం బైటకు రానీయలేదు.
నిందితులను అరెస్టు చేశామని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. హత్యకు గల కారణాలు వెల్లడించే క్రమంలో ఎస్పీ తడబడ్డారు. విలేకరులు గట్టిగా ప్రశ్నిస్తే.. రెండోసారి ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. ఈ కేసులో నింధితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అభివర్ణించారు. అమర్నాథ్ సోదరిని ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని, దాన్ని ప్రశ్నించినందుకే అమర్నాథ్‌ను హత్య చేశారని తెలిపారు. ఈ ఘటనలో వెంకటేశ్వరరెడ్డితోపాటు గోపిరెడ్డి, సాంబిరెడ్డి, వీరబాబు నిందితులుగా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డి తన వాహనంలోని పెట్రోల్‌ను హత్య చేయడానికి ఉపయోగించినట్లు తేలిందన్నారు. అయితే, ఇదే అంశంపై అంతకు ముందు మాట్లాడి ఎస్పీ ఈ కేసు విషయమై మరో విధమైన వివరాలు వెల్లడించారు. ఎస్పీ మెుదట వెల్లడించిన వివరాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా నిలిచే విషయంలోనూ... ప్రభుత్వ వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వైసీపీ సానుభూతిపరులు మరణిస్తే.. వెను వెంటనే పరిహారం ప్రకటించారు. కానీ అమర్నాథ్ కుటుంబం తెదేపా సానుభూతిపరులు కావడంతో.. పక్షపాతం చూపించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యక్తిగతంగా వచ్చి లక్ష రూపాయలు ఇవ్వాలని చూడగా.... బాధిత కుటుంబం తిరస్కరించింది. ఆయన్ను గ్రామంలోకి రాకుండా స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం.. 10లక్షల పరిహారం ప్రకటించింది. హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబం... గౌడ సామాజికవర్గానికి చెందింది.ప్రభుత్వం నుంచి పరిహారం ఇచ్చేందుకు అదే వర్గానికి చెందిన మంత్రి జోగి రమేష్ ఇవాళ ఉప్పాలవారిపాలెం వెళ్లనున్నారు.