CBN Bapatla Tour: గుంటూరు, బాపట్ల జిల్లాల్లో శుక్రవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. పొన్నూరులో మైనార్టీలతో ఆత్మీయ సమావేశం, టీడీపీ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ తర్వాత బాపట్ల బయలుదేరారు. మార్గమధ్యలో చింతలపూడి వద్ద 102ఏళ్ల ధూళిపాళ్ల ఇందిరాదేవిని కలిసి పాదాభివందనం చేశారు. అప్పికట్ల వద్ద పార్టీశ్రేణులకు అభివాదంచేస్తూ ముందుకుసాగారు. ఈతేరు దళితవాడలో టీ దుకాణం వద్ద తేనీరు సేవించారు. అనంతరం రోడ్‌షో ద్వారా బాపట్లలోకి ప్రవేశించారు. దారిపొడువునా జెండాలు, పూలతో చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా బాపట్లలోని అంబేడ్కర్ కూడలిలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వారంగాన్ని జగన్ నాశనం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వాకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్తు ఇచ్చి పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాపట్ల తీరప్రాంతంలో వాణిజ్య నౌకాశ్రయం నిర్మించి అభివృధ్ధికి బాటలు వేస్తామన్నారు.
రాష్ట్రానికి రెండు కళ్లులా ఉన్న అమరావతి, పోలవరానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.రివర్స్ టెండరింగ్‌తో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని విమర్శించారు. అప్పట్లో అమరావతి బిల్లుకు మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
'అన్నక్యాంటీన్ల' కంటే సంక్షేమం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. 5 రూపాయలకే పేదలకు కడుపునింపే క్యాంటీన్లను ఎందుకు మూసేశారని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్నది సంక్షేమం కాదు.. సంక్షోభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాలు బాగుపడాలంటే.. దుర్మార్గ ప్రభుత్వం దిగిపోవాల్సిందేనన్నారు. రాష్ట్రభవిష్యత్ కోసం చైతన్యంతో తిరుగుబాటు చేయాలని...ఇందుకు ఇంటికొకరు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బాపట్ల సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లి పయనమయ్యారు. తుపాను కారణంగా నేడు చీరాలలో జరగాల్సిన చంద్రబాబు పర్యటన రద్దయింది.
"పోలవరాన్ని నా ప్రాణ సమానంగా చుశాను. 72 శాతం పనులు పూర్తి చేసిన తర్వాత సైకో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి.. కాంట్రాక్ట్రర్లను మార్చేసి రివర్స్ టెండరింగ్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. పోలవరం పూర్తైతే మూడు పంటలకు నీళ్లు అందేవి. నిన్ననే పార్లమెంటులో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఓ మంత్రి అన్నాడు. ఇది విన్న నాకు ఎంతో బాధగా కలిగింది. కష్టపడి నిర్మించిన ప్రాజెక్టును బురదలో పోసిన పన్నీరు చేశాడనే బాధ, ఆవేదన కలుగుతోంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత
నా కోసం కాదు.. భావితరాల కోసం పని చేశా.. మూడేళ్లలో రూ.5.5 లక్షల కోట్ల అప్పు చేశారు.. మేం వచ్చాక ప్రతి మండలంలో అన్న క్యాంటీన్ పెడతాం.. ఇప్పుడు సంక్షేమం లేదు.. సంక్షోభం మాత్రమే ఉంది. రాష్ట్రంలో ఒక్క ఉపాధ్యాయుడూ సంతోషంగా లేరు.. పాఠాలు చెప్పటం మాని మరుగుదొడ్ల ఫొటోలు పంపాలట.. సూర్యలంక బీచ్ వద్ద 500 ఎకరాలు కాజేసారు.. 400 ఎకరాల అటవీప్రాంతం కొట్టేయాలని చూస్తున్నారు.. మేం వచ్చాక బాపట్లలో నౌకాశ్రయం ఏర్పాటు చేస్తాం.- చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: