TDP Bus Yatra Second Day: మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా వేటపాలెంలోని కొణిజేటి చేనేతపురిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో దోచుకో దాచుకో అన్న రీతిలో పాలన సాగుతుందని నక్కా ఆనందబాబు విమర్శించారు. ఇసుక, మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణా వైసీపీ నాయకుల కనుసన్నల్లో సాగుతుందని ఆరోపించారు. జైల్లో చిప్పకూడు తిన్న జగన్.. చంద్రబాబును విమర్శించటం హ్యాస్యాస్పదమన్నారు. సైకో ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమయిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆనందబాబు పేర్కొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. తమ పాలనలో విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర నేడు పర్చూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
TDP Bus Yatra in Kondapi: భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో రెండో రోజు ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. రానున్న ఎన్నికల్లో రాక్షస పాలనను అంతమొందించాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని.. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు మీదే ఆధారపడి ఉందని.. తెలుగుదేశం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కృషి జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లోకి వెళ్లి తెలుగుదేశం విధానాలను చైతన్యపరిచారు. గత ప్రభుత్వ హయంలో కొండపి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, ఈ ప్రభుత్వం చిన్న పని కూడా చేయలేదని నాయకులు విమర్శించారు.
TDP Bus Yatra in Payakaraopeta: భవిష్యత్‌కు గ్యారంటీ మేనిఫెస్టోపై టీడీపీ విస్తృత ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా జోన్-1 పాయకరావుపేట నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తామని నాయకులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలంటే వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ ప్రభుత్వం అధికారులోకి వచ్చిన తర్వాత ఉపాధి, పరిశ్రమలు లేక యువత భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయిందని తెలిపారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. అనంతరం పాయకరావుపేట నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Review on Bus Yatra in Anantapur: అన్ని విధాలా దెబ్బతిన్న మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో భవిష్యత్తుకు గ్యారెంటీపై నిర్వహిస్తున్న బస్సు యాత్రపై అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.