Land dispute settled in Chakrayapalem: కక్ష కట్టి.. ఇల్లు కూలగొట్టి.. కథనానికి కదిలిన రెవెన్యూ అధికారులు సమస్యని పరిష్కరించి వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేశారు. కథనాన్ని తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒంగోలులో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ వద్దకు వెళ్లి అక్కడ నుంచి సెల్‌ఫోన్ ద్వారా అద్దంకి రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి సమస్య పరిష్కారం కావాలని లేదంటే అధికారులైన మీరు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎట్టకేలకు అద్దంకి మండల రెవెన్యూ యంత్రాంగంలో కదలిక ఏర్పడింది. వెంకాయమ్మ స్థలం వద్దకు వెళ్లి కొలతలు వేసి రైతు భరోసా కేంద్రానికి దారిపోను మిగిన స్థలానికి హద్దు రాళ్లు పాతి ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అంతే కాకుండా అదే గ్రామంలో మరో రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని వారికి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫలితంగా రెండు రోజులుగా జరుగుతున్న చక్రాయపాలెం స్థల వివాదం సద్దుమణిగింది. మా సమస్యకు స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, అద్ధంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌కు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, ఈటీవీ వారికి వెంకాయమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ జరిగింది: బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలేనికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు ఇంటి పక్కనే రైతు భరోసా కేంద్రం నిర్మించారు. అయితే ఆర్బీకేకి వెళ్లే దారి విషయంలో వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచి, ఉపసర్పంచితో.. శ్రీనివాసరావు కుటుంబానికి వివాదం ఏర్పడటంతో.. శ్రీనివాసరావుకు చెందిన రేకుల ఇల్లు, ప్రహరీ, గడ్డివామి తొలగించి.. రైతు భరోసా కేంద్రానికి రోడ్డు వేయాలని పట్టుబట్టారు. ఆమేరకు శ్రీనివాసరావు కుటుంబం నివాసం ఉంటున్న రేకుల ఇంటిని పొక్లెయిన్‌తో రెవెన్యూ అధికారులు కూల్చేశారు. గడ్డివాముని చెల్లాచెదురు చేశారు.
గతంలో ఇలా చేయగా.. శ్రీనివాసరావు కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఫిర్యాదుతో.. శ్రీనివాసరావు కుటుంబంపై అద్దంకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసులకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ శ్రీనివాసరావు కుటుంబానికి అధికార పార్టీ నాయకుల ద్వారా పోలీసులు కబురు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినవారు.. సాయంత్రం 5 గంటలకు నోటీసులు తీసుకున్నారు. ఈలోపు తమ రేకుల ఇంటిని కూల్చారని తెలుసుకున్న వెంకాయమ్మ.. మనస్తాపానికి గురే పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే పురుగులమందు తాగారు. పోలీసులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లారు. పూర్తి కథనం కోసం దీనిని క్లిక్ చేయండి