Flight Landing Test on National Highway : విపత్కర పరిస్థితుల్లో విమానాలు దిగటానికి రన్ వేలు ఎంతో అవసరం. కానీ, అన్నిచోట్లా రన్ వేలు అందుబాటులో ఉండవు. అలాంటి పరిస్థితుల్లో జాతీయ రహదారులపైనే విమానాల ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావించింది. దేశంలోని 28 ప్రాంతాల్లో ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద ఈ తరహా రన్‌వేల నిర్మాణాన్ని కేంద్రం ప్రారంభించగా.. 13చోట్ల పనులు పూర్తయ్యాయి.
రాష్ట్రంలో ఈ తరహా రన్‌వేలు రెండున్నాయి. వీటిలో బాపట్ల జిల్లాలో నిర్మించిన రన్ వే పనులు పూర్తయ్యాయి. కొరిశపాడు నుంచి జె.పంగులూరు మండలం రేణింగవరం వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. రన్‌వేలను వివిధ దశల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ల్యాండింగ్‌కు అనుమతిస్తారు. అన్ని రకాలుగా పరిశీలించి వచ్చే ఏడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా.. ఈ రన్ వేను ప్రారంభించనున్నారు. విపత్తు సమయాలలో విమానాలు అత్యవసరంగా దిగడానికి ఇలాంటి సౌకర్యం ఉండటం భవిష్యత్తులో ఎంతగానో ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ట్రయల్ రన్ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు రేడియం రంగులు వేశారు. విమానాల సిగ్నల్ కోసం రాడార్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్‌కు వచ్చే విమానాలు రన్‌వేపై వంద మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయని వాయిసేన అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రన్‌వేపై పూర్తిస్థాయిలో దిగుతాయన్నారు ట్రయన్‌రన్‌కు సంబంధించి ఏర్పాట్లను బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమం జయప్రదమయ్యేలా సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: