YSR Matsyakara Bharosa Funds Released Today: సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసాను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 కాలంలో సముద్రంలో వేటను నిషేధిస్తారు. ఆ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదని అర్హులైన అందరికీ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1 లక్ష23 వేల519 ఒక్కొక్క కుటుంబానికి 10 వేల రూపాయల చొప్పున 123.52 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇవాళ సీఎం విడుదల చేయనున్నారు. దీనితో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23 వేల458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు 108 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. నిజాంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 10 గంటల ప్రాంతంలో వెఎస్సార్ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వీఐపీలు, పార్టీ నాయకులు, అధికారులు కూర్చునేందుకు వీలుగా వేర్వేరు గ్యాలరీల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు రహదారి మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లకు కొంత వరకు షేడ్నెట్ కట్టారు. బాంబు, డాగ్స్స్క్వాడ్ తనిఖీలు చేశారు. సోమవారం సాయంత్రం ట్రయల్ రన్ వేశారు.
భద్రతా సిబ్బంది అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మరో మారు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో విద్యుత్తు బల్బులు, వేసవిని దృష్టిలో ఉంచి కూలర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణా రావులు, మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చదవండి: