CM Jagan Relased YSR Mastyakara Funds: మత్స్యకారులకు గత ప్రభుత్వాలు చేయని విధంగా.. ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్యకార భరోసా నిధులను బటన్ నొక్కి సీఎం విడుదల చేశారు. వాడరేవు ఫిషింగ్ హార్బర్, నిజాంపట్నం ఆక్వాపార్క్‌కు శంకుస్థాపన చేశారు. వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం చేశామని సీఎం చెప్పారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 10 వేల రూపాయల చొప్పున సాయం చేసి ఆదుకుంటున్నామన్నారు. మొత్తం 1లక్షా 23వేల 519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23వేల 458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని చెప్పారు. చంద్రబాబు ఐదు సంవత్సరాలలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేనని చెప్పారు. మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. గతంలో డీజిల్‌పై 6 రూపాయలు ఇస్తే.. ఇప్పుడు 9 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
"మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం చేశాం. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నాం. నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఏ మత్స్యకార కుటుంబం ఇబ్బంది పడకూడదనేదే నా తపన."-సీఎం జగన్
CM Jagan Comments on Chandrababu and Pawan: తాను చేసిన మంచిని, ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకుంటే... చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుల్ని నమ్ముకున్నారని... సీఎం జగన్ విమర్శించారు. వీరిద్దరికీ విడిగా 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని... అందుకే మళ్లీ కలుస్తున్నారని సీఎం మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవడమే చంద్రబాబు, పవన్ ఎజెండా అని ఆరోపించారు. చంద్రబాబు కాల్ షీట్లు దొరికినప్పుడు, సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లడమే పవన్ పని అని విమర్శించారు. ఒక్కో ఎన్నికలకు ఒక్కో రేటుకు పవన్ కల్యాణ్... పార్టీని అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు.
"నేను.. చేసిన మంచిని, ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకున్నాను. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుల్ని నమ్ముకున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవడమే వారి ఎజెండా. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు. సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు పవన్ రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడమే పవన్ పని."-సీఎం జగన్
ఇవీ చదవండి: