Chandrababu visited Amarnath family: రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి రావణ కాష్టంలా మార్చారని.. వైసీపీ చేసే అరాచకాలకు ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమర్నాథ్ హత్య తర్వాత ఆడబిడ్డలను కాపాడకునేందుకు కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రికి కూడా ఆడపిల్లలు ఉన్నారని.. వాళ్లను ఏవరైనా ఏమైనా అంటే సీఎం చూస్తూ ఊరుకుంటారా.. ఇలానే స్పందిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ జోక్యం చేసుకోకపోతే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు, పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే అమర్నాథ్ సోదరికి ధైర్యం చేప్పేందుకు తాను ఇక్కడకు వచ్చానని అన్నారు.
సీఎం స్పందించకపోతే నేరస్థులు ఎంతకైనా తెగిస్తారు.. అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురు తిరిగితే ఇక బలైపోవాలా అని నిలదీశారు. రావణ కాష్టంలా తయారవుతున్న రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని మండిపడ్డారు. తాము కూడా మనుషులమేనని వైసీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు. ట్యూషన్‌కి వెళ్తున్న అమర్నాథ్ని అతి కిరాతకంగా సజీవదహనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాణాపాయంతో అమర్నాథ్ కొట్టుమిట్టాడుతుంటే పోలీసులు నింపాదిగా వ్యవహరించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోతే నేరస్థులు ఎంతకైనా తెగిస్తారని అన్నారు. భర్త ముందే భార్యని వేధించినా నోరెత్తకూడదనే పరిస్థితి ముందు ముందు తీసుకొస్తారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి కూడా ఆడబిడ్డలు ఉన్నారని గుర్తించాలన్నారు. సీఎం ఇంటి సమీపంలో సామూహిక అత్యాచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి స్పందించడా అని విమర్శించారు.
అమర్నాథ్ సోదరి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన.. అమర్నాథ్ సోదరి హేమశ్రీకి ధైర్యం ఇవ్వటానికే తాను ఇక్కడకు వచ్చానని స్పష్టం చేసారు. అమర్నాథ్ సోదరి హేమశ్రీని దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అమర్నాథ్ సోదరి ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చదివించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్ధికసాయం అందజేశారు.
వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. మచిలీపట్నంలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినికి ఇవాళ మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తే.. పేర్ని నాని కేసు లేకుండా చేశాడని మండిపడ్డారు. కండ కావరంతో వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి సంస్కృతి పోతేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందన్నారు. గంజాయిని అరికట్టేందుకు ఉక్కు సంకల్పంతో కృషి చేస్తామని వెల్లడించారు. వెధవ పనులు చేసే సైకోలను కట్టడి చేసే బాధ్యత ఓ అన్నగా తాను తీసుకుంటానని స్పష్టం చేసారు.