YCP LEADERS LAND IRREGULARITIES : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భారీగా భూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు వరసగా ఫిర్యాదులు అందుతున్నాయి. రాజంపేట, నందలూరు మండలాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు జిల్లా కలెక్టర్ గిరీషాకు ఫిర్యాదులు అందగా.. ఆయన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేస్తున్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అండతో వైసీపీ నాయకులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలూ బినామీ పేర్లతో వందల ఎకరాలు ఆక్రమించినట్లు సర్వేనంబర్లతో సహా బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజంపేటలో సురేష్ నాయుడు అనే వ్యక్తి చనిపోవడానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి బెదిరింపులే కారణం అని బాధితురాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆకేపాడు సమీపంలో వందల ఎకరాలను ఆక్రమించారని తెలిపారు.
"ఆ భూముల గురించి నా బిడ్డలను కూడా చంపించారు. మాకు మగ దిక్కులేకుండా పోయింది. మాకు న్యాయం చేయండి. మా భూములను ఎవరికి తోచినంత వారు ఆక్రమించుకుని పట్టాబుక్లు చేయించుకున్నారు"-నిర్మలాదేవి, బాధితురాలు
భూ ఆక్రమణలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ గిరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నందలూరు, రాజంపేట మండలాల్లో ముందుగా నలుగురు వీఆర్వోలను సస్పెండు చేయడంతో పాటు.. తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ డివిజన్ లో భూములను కాపాడాల్సిన రెవిన్యూ డివిజనల్ అధికారి కోదండరామిరెడ్డి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అధికార పార్టీ నేతలతో లాలూచీ పడి భూ ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడింది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజంపేట ఆర్డీవో కోదండ రామిరెడ్డిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేసుకోవాలని ఈనెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమ్నరాథ్ రెడ్డి కుటుంబంపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. తాను గానీ, తన కుటుంబం గానీ ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడ లేదని చెప్పుకొచ్చారు. తాను ఆక్రమించినట్లు తేలితే ట్రస్టుకు రాసిస్తానని తేల్చి చెప్పారు. రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో రోజుకో భూ బాగోతం బయటికి రావడంతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.
"739 సర్వే నెంలో మాకు ఎటువంటి భూమి లేదు. మాది ఉమ్మడి కుటుంబం. ఫిర్యాదులో వచ్చిన సర్వే నెంబర్లో మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అందులో భూమి ఉందని తేలితే ట్రస్ట్‌కు రాసిస్తాం"-ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప జడ్పీ ఛైర్మన్
ఇవీ చదవండి: