Sand Irregularities in Anantapur Penna River: అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమార్కులు ఏకంగా పెన్నా నదిని ఆక్రమించేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. సొంత రీచ్‌లు నడుపుతూ ఇసుక దందా సాగిస్తున్నారు. నదికి వెళ్లే మార్గాల్లో పదిచోట్ల గేట్లు ఏర్పాటుచేసి తాళాలు వేశారు. ఇసుక తరలించే ట్రాక్టర్ల యజమానులు.. ట్రిప్పునకు 300 నుంచి 500 రూపాయలు కప్పం కట్టాల్సిందే. లేదంటే.. బండి ముందుకు కదలదు.
ఇసుక మాఫియాకు డబ్బు చెల్లిస్తున్న ట్రాక్టర్ల యజమానులు.. ఆ ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల్ని దోచుకుంటున్నారు. ఈ దందాపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిని ఆక్రమించిన 10 మంది వైకాపా నాయకులు.. స్థానిక ప్రజాప్రతినిధికి నెలకు 30 లక్షలు, తాడిపత్రి డివిజన్‌లోని ఓ పోలీసు అధికారికి నెలకు 10 లక్షల రూపాయల చొప్పున ముట్టజెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
పెన్నానదిలో ప్రభుత్వం ఇసుక రీచ్‌ను కేటాయించకపోయినా.. భారీ ఎత్తున తవ్వుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటిపోయి.. పండ్ల తోటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఇసుకను దోచుకుంటున్న ఆ 10 మంది నాయకులు.. గ్రానైట్ పరిశ్రమ వ్యర్థాలతో నదిలో రోడ్డు కూడా నిర్మించారు. ఈ పది మందితోపాటు స్థానిక వైకాపా ప్రజాప్రతినిధికి, పోలీసు అధికారికి.. వెంకటేశ్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్లు .. ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకొంటున్నారు.
ఇవీ చదవండి: