YSRCP leaders violated rules in MLC election campaign: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తునారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాఠశాల పని వేళల్లో.. వైఎస్సార్సీపీ నాయకులు పాఠశాలలోకి వెళ్లి ప్రచారం చేశారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారు. బెలుగుప్ప ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లగా, పని వేళల్లో ప్రచారం వద్దని అక్కడి ఉపాధ్యాయులు వారిని వెనక్కి పంపారు. అక్కడి నుంచి స్థానిక కేజీబీవీ పాఠశాలలో కరపత్రాలు పంపిణీ చేసి, తమ అభ్యర్థికి ఓటు వేయాలని ఉపాధ్యాయులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. పాఠశాల పని వేళల్లో ప్రచారం చేయటానికి అనుమతించవద్దని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కేజీబీవీలోకి అనుమతించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం.. కడప జిల్లాలో టీచర్లకు గిఫ్ట్ బాక్స్‌లు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు లంచ్, టిఫిన్ బాక్సులను తాయిలాలుగా పంపిస్తున్నారు. కడప గర్ల్స్ హైస్కూల్‌లో గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్న వారిని సీపీఐ నాయకులు పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
అంతకు మందు.. కడప జిల్లా బద్వేల్, అన్నమయ్య జిల్లా నందలూరు సహా పలు చోట్ల పాఠశాలలో బాక్స్‌లు పంచేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు తీసుకునేందుకు తిరస్కరించారు. దీంతో బాక్సుల్ని అక్కడే వదిలేసి వెళ్లారు. కానుకల పంపిణీ విషయం సీఐటీయూ, డివైఎఫ్ఐ, ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఎన్నికల సిబ్బంది గిఫ్ట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం సీఎం జగన్ అడ్డదారుల్లో ప్రయత్నించడం దుర్మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: