YSRCP Government Lands Grab From Farmers In Anantapur: రెక్కలు ముక్కలు చేసుకుని కొండలను చదును చేశారు. రెండు దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నారు. నిరుపేదలైన తమకి ఆ భూములకి సంబంధించిన పట్టాలు ఇవ్వాలంటూ అధికారుల చుట్టా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. పట్టాలు మాట పక్కన పెడితే ఇప్పుడు అధికారులు ఆ భూమిని వారి నుంచి లాక్కోవాలని చూస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కూడేరు గ్రామం పరిధిలో సర్వేనెంబర్ 535లో 463 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొండలు, గుట్టలు నిండిన ఈ భూమిని 5 దశాబ్దాలుగా ఎవరికీ కేటాయించలేదు. కూడేరు, అరవకూరు, కడదరకుంట గ్రామాలకు చెందిన 150 రైతులు రెండు దశాబ్దాల నుంచి దాదాపు 230 ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. కొందరు వర్షాధార పంటలు వేస్తుండగా.. మరికొందరు బోర్లు వేసుకుని పండ్ల తోటలు, వేరు శనగ సాగు చేస్తున్నారు. తాము సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాలని 20 ఏళ్లగా అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.
పట్టాలు వస్తాయనుకున్న రైతులకు మిగిలిన నిరాశ: భూమి అటవీ శాఖకు చెందినదంటూ రెవెన్యూ అధికారులు 2009లో రైతులకు నోటీసులిచ్చారు. దీనిపై ఆగ్రహించిన రైతులు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత సర్వే చేయించి భూమి అటవీ శాఖది కాదని ప్రభుత్వానిదేనని నిర్దరించారు. ఇక పట్టాలు వస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. రెవెన్యూ అధికారులు అనేక సార్లు వివరాలు నమోదు చేసుకున్నారే తప్ప.. పట్టాలు పంపిణీ చేయలేదంటూ రైతులు వాపోతున్నారు.
పట్టాలు ఇవ్వకపోగా ఏపీఐఐసీకి భూమి బదిలీ: 2018లో ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ ఈ సర్వే నెంబర్ భూమిలో పవన విద్యుత్ ఉత్పత్తి పంకాలు ఏర్పాటు చేసింది. ఈ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు.. 4 వేల రూపాయలు ఇస్తామని చెప్పింది. 24 మంది రైతులకు నగదు చెల్లించి హక్కు బదిలీ పత్రం రాయించుకుంది. రెవెన్యూ అధికారులు తమని గుర్తించి పట్టాలిస్తారని భావించిన రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. పట్టాలు ఇవ్వకపోగా ఏపీఐఐసీకి 200 ఎకరాల భూమిని బదిలీ చేశారు. మరోవైపు జగనన్నస్మార్ట్ సిటీ నిర్మాణం కోసం 32 ఎకరాలను కేటాయించారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న తమకి పట్టాలివ్వకుండా.. ప్రభుత్వం ప్లాట్లు వేసుకుని అమ్ముకోవాలని చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని లాక్కోవాలని చూస్తే.. ఊరుకోమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.