అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిలం వద్ద పెన్న నది తీరంలో వెలసిన శ్రీ ఏటి గంగమ్మ అమ్మవారి జాతర (తిరునాళ్లు) ఆదివారం ఘనంగా జరిగింది. పవిత్ర మాఘ మాసంలో మూడో ఆదివారం నాడు ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతాయి. తెల్లవారుజాము నుంచే పెన్నా నదిలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. మంగళ ముఖిలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మాఘ మాసంలో ఇక్కడ స్నానాలు ఆచరించి పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. పూజల అనంతరం నది ఒడ్డునే వంటావార్పు చేసి కుటుంబ సభ్యులతో కలసి భోజనాలు చేశారు. ఈ జాతరలో అనంతపురం జిల్లా వాసులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు.. గంగమ్మ దర్శనం కోసం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి