Worst Roads in Minister Usha Sricharan Constituency: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. రహదారుల నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే బ్యాంకులు నిధులిచ్చినా రోడ్లు బాగుపడటం లేదు. ప్రధాన రహదారి నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లే పంచాయతీరాజ్ రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యి తరహాలో ప్రజలకు నరకాన్ని చూపుతున్నాయి. కొన్నిచోట్ల ఆర్బాటంగా రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, శిలాఫలకాలు వేయించారు కానీ రోడ్డు మాత్రం నిర్మించలేదు. కుందుర్పి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఈటీవీ బృందానికి శిలాఫలకాలు ఘనంగా పెట్టి, రహదారిపై మాత్రం నాలుగేళ్ల క్రితం కంకరవేసి వదిలేసి పరిస్థితులు సాక్షాత్కరించాయి. కంకర వేసిన రహదారులపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పావుతున్న పరిస్థితి నెలకొంది. ఉష శ్రీచరణ్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు రోడ్డు కోసం పరిచిన కంకర, మంత్రి అయ్యాక కూడా బీటీ రోడ్డు వేయని దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ప్రజల అంచనాలు తలకిందులు... దేశంలో ఎక్కడైనా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల నియోజకవర్గాలు ఇతర ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల కంటే మౌలిక వసతుల పరంగా ఎంతో కొంత మెరుగ్గా ఉంటాయి. అయితే ప్రజలకు ఏదైనా మంచి చేయాలని భావించి, గ్రామీణులకు మౌలిక సదుపాయలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నవారి పరిస్థితి అది. కానీ అనంతపురం జిల్లా మంత్రి ఉష శ్రీచరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారులు ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉష శ్రీచరణ్‌కు మంత్రి పదవి వచ్చినపుడు నియోజకవర్గ ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తారని, అందరికంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయని భావించారు. కానీ ప్రజల అంచనాలు తలకిందులై గ్రామీణ రహదారులకు కనీసం అతుకులు కూడా వేయించలేని మంత్రి ఉష గురించి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి బొత్స భూమి పూజ... కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయటానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. ప్రధాన రహదారులతో గ్రామీణ రోడ్లను అనుసంధానం చేస్తూ బీటీ రోడ్లు నిర్మించటానికి ఆ బ్యాంకుల నిధులు ఇచ్చింది. ఇలా ఈ నిధులతో 1.89 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, అపిలేపల్లి-మందలపల్లి రహదారిని బీటీ రోడ్డుగా మార్చాలని నిర్ణయించారు. 2020లో కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉష మరో అడుగు మందుకేసి ఏకంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో భూమిపూజ చేయించారు. ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి శిలాఫలకం ఏర్పాటు చేసి, దానికి వైఎస్సార్సీపీ రంగులు కూడా వేశారు.
నాలుగేళ్లుగా నరకం.. మంత్రి భూమిపూజ చేశాక సరిగ్గా నెలరోజులకు అంటే ఫిబ్రవరి 2020లో రెండున్నర కిలోమీటర్ల పొడవుండే మందలపల్లి రహదారిపై కంకర పరిచారు. అప్పటి వరకు మట్టి రోడ్డు మీద ప్రజలు తిరిగేవారు. కంక పరుస్తుంటే మన ఎమ్మెల్యే ఉష చాలా బాగా రోడ్డు వేయిస్తున్నారని అందరూ సంతోష పడ్డారు. కాని కంకర పరిచి వెళ్లిన గుత్తేదారు నాలుగేళ్లుగా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ కంకర రోడ్డుతో ఆ గ్రామానికి ఆటోలు రావు, అత్యవరమైతే అంబులెన్సులు కూడా రావటంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ఇప్పటికే 20 మందికి పైగా ద్విచక్ర వాహనాల్లో వెళుతూ కింద పడి కాళ్లు, చేతులు విరిగిన సంఘటనలు ఉన్నట్లు మందనపల్లి గ్రామస్తులు మంత్రి ఉష శ్రీచరణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. మరి కంకర పరిచి నాలుగేళ్లుగా వదిలేసిన ఈ రహదారి ఎందుకు ఆపేశారన్న గ్రామస్తుల ప్రశ్నకు మంత్రి ఉషనే సమాధానం చెప్పాల్సి ఉంది.