TDP Supporters Votes Were Removing: అనంతపురం జిల్లాలో కొత్త ఓటర్ల జాబితా విడుదల నేపథ్యంలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలం, చెదుల్ల గ్రామ మాజీ సర్పంచ్ నారాయణస్వామి తమ మండల పరిధిలో 150 ఓట్లకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాప్తాడు మండలం బండమీద పల్లి గ్రామంలో టీడీపీ మద్దతుదారులైన 11 ఓట్లను తొలగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న బీఎల్ఓలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ మద్దతుదారలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బీఎల్ఓ లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు విషయంలో జిల్లాలో కొన్నిచోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవీ చదవండి