Volunteers Suspended: వాలంటీర్లంటే సేవకులు..! సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా పథకాలు ప్రజలకు చేరవేసే సైనికులు..! కానీ, జగనన్న మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు వైకాపా నేతలు..! అక్కడ ప్రజా సేవంటే పార్టీ సేవ. అధికార పార్టీ నేతలకు బాకా ఊదాలి. చెప్పినట్లు తలాడించాలి. ఔను వైకాపా నేతల ఫోటోలను ప్రభుత్వ వాట్సప్ గ్రూప్‌లో పెట్టలేదని సస్పెండ్ చేశారంటూ.. అనంతపురం జిల్లా కౌకుంట్లలో ముగ్గురు వాలంటీర్లు వాపోతున్నారు.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా.. ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకోకుండా సేవ ఎంత అని లెక్క వేసుకుని, పేదల కళ్లల్లో సంతోషం చూడటానికి గుండెల నిండా మానవతావాదన్ని నింపుకుంటున్న.. నా చెల్లేల్లు, తమ్ముల్లందరికీ సెల్యూట్ చేస్తున్నాము అని వాలంటీర్లను ఉద్దేశ్యించి జగన్ అన్న మాటలివి.
వాలంటీర్ల విధుల గురించి ముఖ్యమంత్రి ఏమన్నారో చదివారు కదా. ఈ ముగ్గురూ రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. అలా చేసే సస్పెన్షన్‌కు గురయ్యారు.! అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లుగా పనిచేసిన మధు, విష్ణువర్ధన్, సరస్వతిని ఇటీవలే పంచాయతీ కార్యదర్శి విధుల నుంచి తప్పించారు. వీళ్లేమైనా లబ్దిదారుల్ని వేధించారా.? పథకాల్ని పక్కదారిపట్టించారా? అనే సందేహం కలిగిందా.
అయితే గ్రామస్థులు మాత్రం వాళ్లు పని బాగానే చేస్తారని అంటున్నారు. వాలంటీర్ సేవలు సక్రమంగా అందించే వారని.. పింఛన్లు అందించే వారని తెలిపారు. సమాయానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూసేవారన్నారు. ప్రజలదృష్టిలో వీళ్లు సేవారత్నాలే.! కాకపోతే వైకాపాకే ఆశించిన సేవలు అందించలేక బలైపోయారు. అక్టోబర్ మొదటి వారంలో కౌకుంట్ల గ్రామ వైకాపా కమిటీ ఎన్నికైంది. కమిటీ సభ్యులు మండల పోలీసు అధికారులను సత్కరించారు. ఆ ఫోటోలను ప్రభుత్వ పథకాల సమాచారం చేరవేసే వాట్సప్ గ్రూపుల్లో పెట్టి ప్రచారం కల్పించాలని వైకాపా కమిటీ సభ్యులు హుకుం జారీచేశారు. అందుకు నిరాకరించడంతో కనీసం మెమో కూడా ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని వాపోతున్నారు.
"ప్రభుత్వ పథకాల సమాచారం అందించే గ్రూపులో వైకాపా నాయకుల ఫోటోలు ప్రచారం చేయమని అడిగారు. మేము అందుకు ఒప్పుకోలేదు. పార్టీకి అనుబంధం కాదు. స్వతంత్రంగా పని చేస్తున్నామని అన్నాము. మమ్మల్ని సస్పెండ్ చేయటానికి కారణం ఏంటని పంచాయతి కార్యదర్శిని ప్రశ్నించగా.. మిమ్మల్ని వైకాపా నాయకులే తొలగించారని తెలిపారు". -విష్ణువర్ధన్, సస్పెండైన వాలంటీర్
"మమ్నల్ని తొలగించే దాని పైన మెమో కానీ, ఏదైనా మేము తప్పు చేశామనే అధారాలు ఉంటే మమ్మల్ని తొలిగించండని కోరాము. కార్యదర్శి మాత్రం మా దగ్గర అలాంటివి ఏమి లేవు.. మాకు నాయకుల నుంచి ఒత్తిడి ఉంది. మీరు స్వచ్ఛందంగా రాజీనామ చేయండని అన్నారు. గతంలో వైకాపా నాయకులు పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆదేశించే వారు. మేము పార్టీలపరమైన , వ్యక్తిగతంగా నిర్వహించుకునే కార్యక్రమాలకు హాజరుకాలేమని తెలిపాము. అది మనసులో ఉంచుకున్న నేతలు వీళ్లు పార్టీపరమైన కార్యక్రమాలకు రారని తొలగించారు. సర్కూలర్ ప్రకారం దానికి కట్టుబడి పని చేస్తామని తెలియజేశాము". - మధు, సస్పెండైన వాలంటీర్
ఇక సస్పెన్షన్‌కు గురైన మహిళా వాలంటీర్ సరస్వతినైతే ఏకంగా వచ్చే ఎన్నికలకు ఏజెంటుగా పని చేయాల్సిందేనన్నారు. అది తనపనికాదనడంతో.. విధుల నుంచి తొలగించారని ఆమె వాపోయారు.
"వచ్చే ఎన్నికల్లో ఏజేంటుగా కూర్చోమని అడిగారు. నేను ఏజేంటుగా కూర్చోలేను, పార్టీ పరమైన సమావేశాలకు రాలేనని తెలిపాను. ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతానని తెలిపాను. కార్యదర్శి వైకాపా నాయకులను కలవండి.. అప్పుడే మీకు ఉద్యోగమని తెలిపారు". -సరస్వతి, సస్పెండైన వాలంటీర్
ఈ ముగ్గురి సస్పెన్షన్‌ను గ్రామంలోని వైకాపా సానుభూతిపరులూ తప్పుపడుతున్నారు. "ఈ ముగ్గురి సస్పెన్షన్‌ను గ్రామంలోని వైకాపా సానుభూతిపరులూ తప్పుపడుతున్నారు.
సస్పెండైనా వాలంటీర్లు బ్రహ్మడంగా విధులు నిర్వహిస్తున్నారు. నేను వైకాపా కార్యకర్తనే రాజకీయం రాజకీయంలాగా చేసుకోవాలి. ఆయనకు ఎందుకు ఆయన ఉద్యోగస్తుడు. ఉద్యోగం చూసుకోవాలి కానీ, నువ్వు రాజకీయ నాయకులతో కలిసి అట్లా చేప్పేది ధర్మం కాదు". - జక్కిరెడ్డి, వైకాపా సానుభూతిపరుడు
లబ్దిదారులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా.. సస్పండ్ చేయడం రాజకీయం కాక మరేంటని గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చదవండి :