అనంతపురం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అయిన స్పందనకు బాధితులు వెల్లువెత్తారు. కరోనా వైరస్ విజృంభణ తో ఏడాది కాలంగా స్పందన కార్యక్రమం నిలిపివేశారు. మూడు వారాలుగా మళ్లీ ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు. పలు కారణాలతో జిల్లాలో కొనసాగుతున్న పింఛన్ తొలగింపులతో దివ్యాంగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా దివ్యాంగులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈలోపు చంద్ర దండు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు ప్రకాశ్ నాయుడు సైతం మరో 50 మంది దివ్యాంగులతో కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేయటానికి వెళ్లారు. పింఛన్ కోల్పోయినవాళ్లు కొందరైతే, రెండేళ్లుగా కొత్తగా పింఛన్ కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారని ప్రకాశ్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పందన హాల్లోకి చొచ్చుకుని..
పోలీసుల కళ్లుగప్పి ప్రకాశ్ నాయుడుతో పాటు చంద్ర దండు కార్యకర్తలు స్పందన హాల్లోకి వెళ్లారు. ఫించన్ల తొలగింపు తదితర అంశాలపై కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ దివ్యాంగులకు న్యాయం చేయాలని నినదించారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అధికారులకు వివరించటంతో రెండో సంయుక్త కలెక్టర్ డా.సిరి.. స్పందన భవనం నుంచి కిందకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. పరిస్థితిని చక్కదిద్దారు.
ఏ ఒక్క అర్హుడూ సంక్షేమ పథకానికి దూరం కాకూడదనే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు చెబుతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పని చేయడం లేదని బాధితులు వాపోయారు. చాలా చోట్ల వాలంటీర్లే నిరుపేదల పాలిట కక్ష పూరితంగా వ్యవహరిస్తూ పింఛన్ నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్న వారి పట్ల కూడా వాలంటీర్లు, అధికారులు కనీసం దయ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2500 దివ్యాంగుల పింఛన్లు తొలగించారని వారి సంఘ ప్రతినిధులు అధికారుల తీరును ఎండగట్టారు.
ఇదీ చదవండి: