VERTICAL GARDEN SCAM : సుందర అనంతపురం కోసం జిల్లా యంత్రాంగం మొదలు నగరపాలక అధికారుల వరకు ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే పనికిరాని , ప్రజలకు ఏమాత్రం అక్కరకు రాని పనులు చేసి గుత్తేదారులకు కోట్ల రూపాయలు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా నగరపాలక సంస్థల పరిధిలోని నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించటానికి కేంద్ర పర్యావరణశాఖ నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా విస్తారంగా చెట్లు, మొక్కలు పెంచటం, కర్బన ఉద్గారాలను తగ్గించటమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేస్తూ నిధులు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్దేశానికి తూట్లు పొడిచిన అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు.. నగరంలోని బళ్లారి బైపాస్ రహదారిలో 44వ నెంబర్ జాతీయ రహదారి పిల్లర్లకు నిలువు తోట(వర్టికల్ గార్డెన్)ను ఏర్పాటు చేశారు. నాలుగు పిల్లర్లకు ఈ వర్టికల్ గార్డెన్ ద్వారా చిన్న పాటి కుండీలు పెట్టి మొక్కలు పెంపకం చేయాలని గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఏడాది పాటు ఈ గార్డెన్‌ను నిర్వహించేలా ఒప్పందం చేసుకున్న నగరపాలక అధికారులు.. అనువైన మొక్కల పెంపకం చేయించటంలో మాత్రం విఫలమయ్యారు.
కుండీల్లో పెంచటానికి ఏమాత్రం పనికిరాని మొక్కలను నాటారు. అందులో ఏ ఒక్కటీ బతక్కపోవటంతో ఆరు నెలల కాలంలో రెండు సార్లు నాటాల్సి వచ్చింది. నగరానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త నగరపాలక అధికారుల నుంచి సమాచారం తీసుకోవటంతో లక్షల రూపాయలు వృథా చేసిన తీరు వెలుగుచూసింది.
వర్టికల్ గార్డెన్‌ను ఫ్లై ఓవర్ కింద నాలుగు పిల్లర్లకు నిలువునా మొక్కలు పెంచారు. వీటి కోసం 77.22 లక్షల రూపాయలను నగరపాలక సంస్థ ఖర్చు చేసింది. ఈ గార్డెన్ ఏర్పాటు చేసి, దీనికి కంచె కూడా వేశారు. దీని నిర్వహణను గుత్తేదారుడు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో రాత్రి వేళల్లో మద్యం తాగే వారికి ఇది అడ్డాగా మారింది. ఈ వర్టికల్ గార్డెన్ పిల్లర్ వెనుక ఖాళీ మద్యం సీసాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కుండీల్లో పెంచటానికి అనువుకాని మొక్కలను తెచ్చిన గుత్తేదారుడు వాటిని పిల్లర్ వెనుక గుట్టలుగా పడేశాడు.
కాలుష్యాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, మొక్కలు తెచ్చిన పాలిథిన్ కవర్లు అక్కడే గుట్టలుగా పోశారు. ఇక ఈ వర్డికల్ గార్డెన్ పిల్లర్ వద్ద పందికొక్కులు పదుల సంఖ్యలో గోతులు పెట్టినా కనీసం నిర్వహణకు నోచుకోని వైనం నగర ప్రజలకు ఆవేదన కలిగిస్తోంది. మహిళలకు మూత్రశాలలు నిర్మించలేని నగరపాలక అధికారులు, ఇలాంటి వర్టికల్ గార్డెన్ల పేరుతో నిధులు మింగేస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నగరాన్ని కాలుష్య రహితంగా మార్చామని కేంద్ర పర్యావరణశాఖకు తప్పుడు నివేదికలు పంపుతున్నారని నగరపాలక సంస్థ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి, నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కేంద్ర సర్కారుకు లేఖలు పంపటానికి నగరంలోని కొందరు యువకులు సమాయత్తమవుతున్నారు.
ఇవీ చదవండి: