విత్తన సేకరణ, పంపిణీలో ఏటా అక్రమాలు వెలుగులోకి వచ్చే అనంతపురం జిల్లాలో.... ఈసారి ఎరువుల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టన్నుల కొద్దీ యూరియా పక్కదారి పట్టినట్లు...అధికారుల విచారణలో బట్టబయలైంది. జిల్లాకు ఈ ఏడాది 44 వేల 50 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 18 వేల 45 మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే అనుమానాలకు బీజం పడింది. సాధారణంగా జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా..... ఏప్రిల్, మే నెలలో కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వరికి ఎక్కువగా వినియోగించే యూరియాను... మిగిలిన పంటకు వాడినా అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. అలాంటిది........., అంతమొత్తం యూరియా ఎక్కడకు వెళ్లిందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 21 మంది రైతుల పేరుతో... 457 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు గుర్తించామని.... అధికారులు చెబుతున్నారు. ఐతే ఆ 21 మందిలో ఆటో డ్రైవర్లు, విశాఖ, కర్నూలు జిల్లాల రైతులు ఉన్నట్లు విచారణలో తేలింది. అక్రమాలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. యూరియా పక్కదారి పట్టడంపై రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే యూరియా కుంభకోణంపై జిల్లా ఉన్నతాధికారులు నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది డీలర్లకు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి. మోసగాడి వల నుంచి తప్పించుకున్న వైకాపా ఎమ్మెల్యే