అనంతపురంలో రేషన్ దుకాణాలకు బియ్యం, కంది పప్పు చేరని కారణంగా.. కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దుకాణాలను తెరిస్తే సరుకులు తీసుకోవాలని లబ్ధిదారులు ఎదురు చూశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ మాత్రం మధ్యాహ్నమైనా.. దుకాణాలు తెరుచుకోలేదు. కొన్ని దుకాణాల్లో బియ్యం మాత్రమే సరఫరా చేశారు. మరికొన్నిచోట్ల మిగతా సరుకులూ వచ్చాక కలిపి ఇస్తామని రేషన్ దుకాణం డీలర్లు చెబుతుండగా... లబ్ధిదారులు వెనుతిరుగుతున్నారు.
గుత్తి పట్టణంలోని పలు ప్రభుత్వ రేషన్ దుకాణాలు వద్ద లబ్ధిదారులు పడి గాపులు కాశారు. ఎండలో నిలబడలేక సంచులు లైన్ లో పెట్టి నీడకు నిలబడ్డారు. అందరూ సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మడకశిర పట్టణంలో స్టాకు కోసం ఉదయం 4 గంటల నుంచి డీలర్లు వేచి ఉన్నారు. వీరితో పాటు వినియోగదారులు డిపోల వద్ద పడిగాపులుకాశారు. పట్టణంలోని 57వ నెంబర్ చౌక దుకాణానికి సమయం మించినా... వీఆర్వో రాకపోవడంపై ప్రజలు ఆగ్రహించారు. అనారోగ్య సమస్యతో వీఆర్వో రాలేదని తెలుసుకున్న అధికారులు... వార్డు ప్లానింగ్ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించారు. అనంతరం పట్టణంలోని చౌక ధరల డిపోలకు ఎమ్మెల్యే ఉచిత బియ్యం, కంది పప్పు అందించారు.
ఇదీ చూడండి: