అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దాడితోట వద్ద చిత్రావతి జలాశయం నుంచి ప్రవహిస్తున్న నీటిలో మునిగి ఓ ప్రేమజంట గల్లంతైంది. చిత్రావతి నది చూసేందుకు శుక్రవారం వెళ్లిన అమర్‌నాథ్, రామాంజనమ్మ కాలువలో కొట్టుకుపోయారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల గ్రామానికి పిచ్చికుంట్ల అమర్‌నాథ్, అనంతపురం ప్రకాష్‌నగర్‌కు చెందిన రామాంజనమ్మ ఇరువురు ప్రేమికులు. అమర్‌నాథ్ అనంతపురంలో సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అదే మండలానికి చెందిన పరశురాం అనే యువకుడు కూడా అమర్‌నాథ్ వద్ద పని చేస్తున్నాడు. పరశురాం సంక్రాంతి పండగకు దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. వారిని కూడా ఆహ్వానించాడు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం భోజనం చేసి తరువాత చిత్రావతి జలాశయం చూసి, అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడంతా కలిసి చరవాణిలో చిత్రాలను తీసుకునే సమయంలో హఠాత్తుగా రామాంజనమ్మ కాలువలోకి జారిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అమర్‌నాథ్ కుడా కాలువలో పడ్డాడు. పరశురాం వారిని గమనించేలోపు కాలువ మధ్యలో లోతుగా ఉన్న గుంతలోకి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని పరశురాం గ్రామస్థులకు, పోలీసులకు తెలిపాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన జంట కోసం గ్రామంలోని ఈతగాళ్లతో వెతికించారు. రాత్రి కావడంతో వెతకడం కష్టంగా మారిందని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. పండగ రోజున ప్రేమికులు గల్లంతుకావడం ఇరువురు కుటుంబాలలో పెను విషాదాన్ని మిగిల్చింది.
ఇదీ చదవండి.. సినిమా టికెట్ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ