అనంతపురం జిల్లా ఉరవకొండ ఆస్పత్రిలో చరవాణి టార్చ్ లైటే.. డాక్టర్లకు, రోగులకు దిక్కయ్యింది. అరగంట పాటు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి.. ఇన్వర్టర్ మొరాయింపు తోడై.. రోగులకు మరింత చిక్కులు తెచ్చిపెట్టింది. విడపనకల్ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నప్ప.. ఆత్మహత్యకు యత్నించాడు. కడుపు నొప్పితో అతను ఈ పని చేసినట్టు కుటుంబీకులు చెబుతున్నారు.
అతడిని బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఉరవకొండ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆ సమయానికి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇన్వర్టర్ కూడా మొరాయించింది. చికిత్స చేసేందుకు వైద్యులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి చరవాణి టార్చ్ లైట్ వెలుతురులో డాక్టర్లు బాధితుడికి చికిత్స చేశారు. ఆ తర్వాత.. కడుపులోని పురుగుల మందును బయటికి తీయడానికి.. ఆక్సిజన్ అందించేందుకు అనంతపురం తరలించాల్సిందే అని వైద్యులు చెప్పారు.
ఈ పరిస్థితిపై.. రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి ఓ ఎలక్ట్రీషియన్ అంటూ లేకపోవడం.. సమస్యకు కారణమవుతోందని చెప్పారు. అత్యవసర విభాగంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎలా.. అని ప్రశ్నించారు. మౌలిక వసతులు మెరుగుపరచాలని.. అధికారులు సత్వరం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: