ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. మరోవైపు విద్యాలయాల్లో 'మనబడి.. నాడు - నేడు' చేపట్టాలని విద్యాశాఖ ఉత్తర్వులివ్వడం ఉపాధ్యాయ వర్గాల్లో కలవరానికి కాారణమవుతోంది. విద్యా శాఖ ఉద్యోగులకు లాక్‌డౌన్ వర్తించదా అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
తొలి అడుగు
జిల్లాలో 1,279 పాఠశాలల్లో తొమ్మిది రకాల పనులు చేపట్టాలి. తాజాగా 1,178 చోట్ల ప్రారంభించాలి. వెండర్స్‌ను గుర్తించి ఇన్వాయిస్ అప్‌లోడ్ చేయడంతో రూ.3 కోట్లు మొత్తం 1,099 మంది ఖాతాలకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా జమ చేశారు.
పర్యవేక్షణ కుదిరేనా..?
354 మంది సీఆర్పీలు, 1,279 మంది ప్రధానోపాధ్యాయులు, 63 మంది మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, సెక్టోరియల్, ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు మరో 150 మంది నాడు నేడు పనుల పర్యవేక్షణకు కదలాలి. ఆయా ప్రాంతాల్లో కూలీలు, దుకాణ యజమానులు, ట్రాక్టర్ల యజమానులు భాగస్వాములు కావాలి.
రాకపోకలు సాధ్యమేనా..?
పాఠశాలలు ఉన్న ప్రదేశాలకు రవాణా ఎలాగనేది ప్రశ్నార్థకం. నివాస ప్రాంతానికి పాఠశాలకు సుదూరంగా ఉండటంతో ఉద్యోగినులకు రవాణా ఎలాగో పాలుపోవడం లేదు. జిల్లా స్థాయిలో జేసీ, మండల స్థాయిలో తహసీల్దార్ పాసులు ఇవ్వడానికి కలెక్టర్ సమ్మతించినా ఒక్కరూ పాసులు తీసుకోలేదు.
సామగ్రి తెచ్చేదెలా..?
పనుల కోసం ఇసుక, సిమెంట్, కంకర, స్టీలు సరఫరా చేయాలి. అయితే... జిల్లాలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. తాపీ పని వారు, ఇతర పనివారు గ్రామాల నుంచి రావాల్సి ఉండటంతో అనుమతిపై స్పష్టత రావాలి. వీరందరికీ కరోనా నుంచి రక్షణకు ప్రత్యేకంగా మాస్క్‌లు, సామాజిక దూరంపై ఏం చేస్తారో చూడాలి.
అత్యంత ప్రాధాన్యం
లాక్‌డౌన్ ఉన్నా నాడు-నేడు పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందనీ... ఆ పనుల్లో భాగస్వాములు అయ్యే వారికి ప్రత్యేకంగా పాసులు ఇస్తున్నామని డీఈవో శామ్యూల్ తెలిపారు.
ఇదీ చూడండి..