అనంతపురంలోని శివారు కాలనీ రాయల్నగర్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు అన్నమ్మ, రామాంజనేయులు వలస కూలీలకు బాసటగా నిలుస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక నిరాశ్రయులైన వారికి తమ సొంత ఖర్చుతో అన్నదానం నిర్వహిస్తున్నారు. వారి సేవలను గుర్తించిన ఉపాధ్యాయ సంఘాలు అన్నదాన కార్యక్రమంలో తమ వంతు సాయాన్ని అందించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కమిటీతో చర్చించి వీరి ఆలోచనలు పంచుకోవడంతో నిత్యం అన్నదానం చేయడానికి దాతలు ముందుకు వచ్చారు.
గత 48 రోజులుగా నిత్యం వలసకూలీలకు, ఆటో కార్మికులకు,లారీ డ్రైవర్లకు అన్నదానం చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు తమవంతు సాయం అందించటం ఆనందంగా ఉందని ఉపాధ్యాయ దంపతులు పేర్కొన్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నంత వరకు తమ వంతు బాధ్యతగా పేదలకు, వలస కార్మికులకు అన్నదానం చేస్తామని తెలిపారు.