తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. అనంతపురంలో నిన్న జరిగిన రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన అంశాలను పల్లె రఘునాథ్ రెడ్డి ఖండించారు. కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందనే జగమెరిగిన సత్యాన్ని తామెన్నడూ మరచిపోలేమన్నారు.
పార్టీలో చిచ్చురేపే విధంగా జేసీ మాట్లాడడం సరికాదన్నారు. కార్యకర్తల్లో తప్పుడు ఆలోచనలు నింపే వ్యాఖ్యలను విరమించుకోవాలని సూచించారు. రాజకీయ భవిష్యత్తు కావాలంటే మంచితనం, త్యాగం అవసరమని చెప్పారు. అనవసర వ్యాఖ్యలతో రాజకీయ భవిష్యత్తును కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు.
''సమావేశంలో జేసీ హేళనగా మాట్లాడడం సరికాదు. వైకాపా నుంచి జేసీ తెదేపాకు వచ్చారు. అంతకుముందు అక్కడ తెదేపా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో గ్రహించాలి. మా కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. కష్టపడి పార్టీని కాపాడుకుంటాం. కార్యకర్తల కోసం మేం బతుకుతున్నాం. కరోన కష్టకాలంలో కూడా వారు ఇబ్బంది పడకుండా కార్యక్రమాలు చేశాం. జగన్, రాజశేఖర్ రెడ్డిని పొగుడుతావు. వారివల్లే పదవి వచ్చిందని అంటావు. ఎన్టీఆర్ పైనే పోటీ చేశావు. అనేకసార్లు అధినేత చంద్రబాబును విమర్శించావు. అనవసరంగా మాట్లాడేవారు రాజకీయాల్లో ఎదిగిన దాఖలాలు లేవు'' - పల్లె రఘునాథ రెడ్డి, తెదేపా నేత
''తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడినది. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని.. పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. నాయకుడితో మాట్లాడి చర్చించుకోవాలి. అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అవాకులు, చెవాకుల మాట్లాడడం సరికాదు. పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది.'' - బీకే పార్థసారథి, హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
''తెదేపా నేతలు సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే హంద్రీనీవా ప్రాజెక్టులపై చర్చ. ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా నాయకులపై వ్యక్తిగత విమర్శలేంటి ?. కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందని అందరికీ తెలుసు. ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.'' - పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే
ఇదీ చదవండి:
JC PRABHAKAR REDDY: కార్యకర్తలను కాపాడండి.. సీమ తెదేపా నేతల సదస్సులో జేసీ వ్యాఖ్యలు