TDP leader kaluva On Mla kapu: రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. రెండున్నరేళ్ల పనితీరుపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చార్జిషీటు విడుదల చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించి అవినీతిలో మునిగి తేలాడుతున్నాడని పేర్కొన్నారు. నియోజవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాపు పూర్తిగా విఫలం అయ్యారని.. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాపు రూ. 80 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
"గుమ్మగట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టుకు గెలిచిన మూడు నెలల్లో కృష్ణా జలలు తెప్పిస్తామని బీరాలు పలికిన కాపు.. రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కృష్ణా జలాలు తెప్పించడంలో విఫలమయ్యారు. అధికారంలోకి రాగానే వేదవతి, హగరి నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను కర్ణాటకకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. డి హిరేహాల్, బొమ్మనహల్ మండలాల నుంచి కాపు అనుచరులు ఇసుక, మట్టి, కంకర, రాళ్లు బళ్లారికి భారీగా తరలిస్తున్నారు. వీటికి తోడు ఓబులాపురం నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్న క్వారీలను 2018లో ఢిల్లీలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ మూసి వేయించింది. అయితే ప్రభుత్వ విప్‌గా తన అధికారాన్ని ఉపయోగించుకొని కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుతో అక్రమంగా క్వారీ లైసెన్సులు తెచ్చుకొని యథేచ్ఛగా బోల్డర్లను తరలిస్తున్నారు. ఇతర క్వారీలలోని బండరాళ్లను తరలించడంతో పాటు లక్షలు విలువ చేసే యంత్రాలను కూడా ఎత్తుకెళ్లారు. అన్నీ తెలిసిన అధికారులు నిస్సహాయంగా ఉండిపోయారు. రాయదుర్గం ప్రాంతాలలో కర్ణాటక మద్యం ఏరులై పారుతుంది. బొమ్మనహల్, డి హిరేహాల్, గుమ్మగట్ట, రాయదుర్గం రూరల్ మండలాలలో అక్రమ మద్యం వ్యాపారం వైకాపా నాయకులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దందాల వెనుక కాపు రామచంద్రారెడ్డి బిగ్ బాస్‌గా వ్యవహరిస్తున్నారు" అని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
ఇదీ చదవండి..: SP Dance Viral Video : "బుల్లెట్టు బండి" పాటకు.. జబర్దస్త్ డ్యాన్స్ చేసిన పోలీస్ బాస్..!