Minority students are suffring in Garladinne school: 'విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. పాఠశాల భవనాలను నాడు-నేడు కింద కార్పొరేట్ భవనాలుగా మార్చాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి చేశాం' అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరుచూ అన్ని వేదికలపై చెబుతున్న మాటలివి. కానీ, క్షేత్రస్థాయికి వెళితే.. సీఎం జగన్ ప్రాధాన్యతగా తీసుకున్న ఆంగ్ల మాధ్యమం బడుల్లో విద్యార్థుల పరిస్థితిని గమనిస్తే ఎవరికైనా గుండెతరుక్కపోయోలా ఉంది. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మైనార్టీ విద్యార్థుల ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ పాఠశాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదయం అయితే తరగతి గదులు.. రాత్రికి పడకగదులుగా మారుతున్నాయి. చిన్నపాటి గదిలో 70 నుంచి 80 మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుకుంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో బడుల్లో ఏమేమి ఉండాలో చక్కగా వివరించిన చెప్పిన సీఎం.. క్షేత్రస్థాయిలో అవన్నీ అందుబాటులో ఉన్నాయో లేదో పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అనంతపురంలో మైనార్టీ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేశారు. ఈ స్కూల్, హాస్టల్ ఏర్పాటుకు అనంత నగరంలో ఎక్కడా భవనాలు లేక అధికారులు గార్లదిన్నెలో నిరుపయోగంగా ఉన్న ఓ భవనం వైపు చూశారు. జూనియర్ కళాశాల ఏర్పాటుకు భవనం నిర్మించి, అనుమతులు రాకపోవటంతో కళాశాల ఏర్పాటు చేయలేకపోయిన ఈ భవనంలోనే మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని నిర్ణయించారు. ఇలా జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఈ పాఠశాలను గార్లదిన్నెలో పెట్టిన అధికారులు కనీస సౌకర్యాలు కల్పన చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి, అంటువ్యాధులకు గురై నానా ఇబ్బంది పడుతున్నారు.
ఈ మైనార్టీ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలో 9 గదులు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు 450 మంది వరకు ఉన్నారు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు చిన్నపిల్లలు కావటంతో.. ఎదురుతిరిగి ప్రశ్నించరని భావించిన అధికారులు చిన్నపాటి గదిలో 70 నుంచి 80 మందిని నిద్రించమంటున్నారు. పగలంతా తరగతి గదిగానూ, రాత్రి పడకగదిగా వాడుకుంటూ, ఇరుకు గదిలో విద్యార్థులంతా ఒకరిపై ఒకరు పడుకుంటున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ఇంటర్ విద్యార్థులు తక్కువగా ఉండటంతో వారందరినీ ఒకే గదిలో ఉంచుతున్నారు. ఇక మరుగుదొడ్లు, స్నానపుగదులయితే సరేసరి. ఉదయం విద్యార్థులంతా ఒకేసారి లేస్తారు. వీళ్లందరికీ అక్కడున్న 12 మరుగుదొడ్లు ఏమాత్రం సరిపోక బహిరంగ మలవిసర్జన తప్పదు. ఇక ఏ విద్యార్థి అయినా ఆరుబయట స్నానం చేయాల్సిందే. సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో శుద్ధనీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, దాని నిర్వహణ లేకపోవటంతో ఆ యంత్రం నుంచి రక్షిత నీరు విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ఇక చీకటి పడిందంటే గదిలో విషపురుగుల భయం. పాములు కళ్లముందే తిరుగుతున్నా అధికారులు కనీసం ముళ్లచెట్లు తొలగించి శుభ్రం చేయించని పరిస్థితి.
విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై పాఠశాల ఉపాధ్యాయులను నిలదీయగా.. ఉన్నతాధికారులకు సమస్యను తెలిపామని చెబుతున్నారు. ఇప్పటికైనా నిరుపేద మైనార్టీ విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, సౌకర్యాల కల్పన చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నేను ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి చదువుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏ పిల్లలను చూసినా దగ్గు, తామర, గజ్జిలాంటి వ్యాధులు సోకుతున్నాయి. అంతేకాకుండా తినడానికి స్థలం కూడా లేదు. వర్షంపడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ సమయంలో మా హాస్టల్‌లో వంటచేసేవారిని ముందుగానే హెచ్చరిస్తాము. ఇక రాత్రి సమయంలో పిల్లలు ఒకరిపై ఒకరు పడుకుంటున్నారు. దీంతో 5వ, 6వ తరగతి పిల్లలకు రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. మాకు సరైన బాత్ రూమ్‌లు కూడా లేవు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి గది లేక చెట్ల కిందే తింటున్నాం.-మహమ్మద్ ఖయూం, విద్యార్థి
ఇవీ చదవండి