రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రాణాలు విడుస్తున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. అనంతపురంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాజధాని కోసం 18 మంది రైతులు మరణించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి అమరావతినే రాజధానిగా కొనసాగించి, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడిలో ఆందోళన చెపట్టారు ప్రజలు. రైతులు, మహిళలు చిన్నారులు కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రకాశం జిల్లా పర్చూరు, ఐకాస ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. పర్చూరులో భారీ ర్యాలీ చేపట్టారు. రైతులు, మహిళలు, చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించి మూడు రాజధానులు వద్దు.. ఒక్క రాజధాని ముద్దు అంటూ నినదించారు. బొమ్మల కూడలిలో మానవహారం చేపట్టి, మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. రైతుల పట్ల ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని వ్యతిరేకించిన ఐకాస నాయకులు... రాజధాని తరలింపు ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు రాజధానుల పేరుతో అధికార వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కదిరిలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రెండు పార్టీలు భవిష్యత్తులో అనుసరించే విధానాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కలిసి నడుస్తామన్నారు. .
అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కూడలి నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అందరికీ అనుకూలంగా ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నేతలు నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...