petrol bunks facing problems in anantapur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నారా? అయితే ఇక్కడే ఇంధనం నింపుకొని వెళ్లండి. ఏపీ కన్నా మా దగ్గర ధరలు చాలా తక్కువ అంటూ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల పెట్రోలు బంకుల వద్ద ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలే గాక.. సరిహద్దు గ్రామాల్లోని వాహనదారులు సైతం పక్కరాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలోని సరిహద్దు పెట్రోలు బంకులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఐదు పెట్రోల్ బంకులు వ్యాపారం లేక మూతపడ్డాయి. మరో బంకు సైతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. సమీపంలోని కర్ణాటక బంకుల్లో లీటర్‌కు 10 రూపాయల వరకు వ్యత్యాసం ఉండటంతో అక్కడికే వెళ్లిపోతున్నామని వాహనదారులు చెబుతున్నారు.
Petrol Bunk owners problems: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను తగ్గించకపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వైపు వాహనదారులు వెళ్లడం లేదు. వ్యాపారం లేక నిర్వహణ భారమైందంటూ బంక్ యజమానులు వాపోతున్నారు. కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద 5 బంకులు మూతపడటంతో పనిచేసే సిబ్బంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వినియోగదారులు పక్క రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని బంక్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.