అనంతపురం జిల్లా మిర్చి రైతులను కష్టాలు వీడటం లేదు. ఏటా పంట కోసి కుప్పలేసే సమయానికి వాలిపోయే వ్యాపారులు ఈసారి అటువైపే చూడటం లేదు. ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లో అత్యధికంగా మిరప సాగు చేస్తుంటారు. 7వేల హెక్టార్లలో 2500 హెక్టార్ల వరకు బాడిగ రకం సాగవుతోంది. కర్ణాటక మార్కెట్లకు విక్రయించడమే కాక ఆహారశుద్ధి పరిశ్రమల అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మిరప రకాలను పండిస్తుంటారు. గతేడాది ఎర్ర రంగు ఉత్పత్తి చేసే బాడిగ రకం ఎండు మిరప... బళ్లారి మార్కెట్‌లో రికార్డుస్థాయిలో క్వింటా రూ.45 వేల ధర పలికింది. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది.
గతేడాది వర్షాలతో తెగులు సోకి పంట పూర్తిగా దెబ్బతింది. ఎలాగోలా 50 శాతం పంటను దక్కించుకున్న రైతులు... ప్రస్తుతం మిరప కోసి కుప్పలేసుకున్నారు. నాణ్యత, దిగుబడి తక్కువగా ఉండగా కొనేందుకు వ్యాపారులు సుముఖంగా లేరని రైతులు వాపోతున్నారు. కూలీల ధరలూ పెరగటంతో పెట్టుబడి ఒక్క పైసా కూడా తిరిగొచ్చేట్టు లేదని రైతులు బోరుమంటున్నారు.
ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... నేడు ఆ ప్రస్తావనే మరిచిపోయాయని మిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: