అనంతపురం జిల్లాలో 13వేల హెక్టార్లలో రైతులు అరటి సాగు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పంట చేతికొస్తుంది. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టం తేరుకోకముందే అరటి పంటపై సిగటోగ తెగులు విజృంభించింది. సిగటోగ తెగులు సోకడంతో అరటి పండ్లన్నీ చెట్లపైనే మాగిపోతున్నాయి.
ప్రస్తుతం టన్ను అరటి గెలల ధర రూ.10 నుంచి 11వేల వరకు ఉండగా.. ఈ తెగులు సోకిన గెలలను రూ.3వేలకు కూడా వ్యాపారులు కొనటం లేదు. కొనేవాళ్లు లేక పంట తోటలోనే కుళ్లిపోతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫ్రూట్స్ కంపెనీ కుడా.. రైతుల నుంచి అరటిని కొనుగోలు చేయటం లేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని.. వ్యాపారులు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు.
వర్షాల కారణంగానే పండ్లు మాగిపోతున్నాయి
అధిక వర్షాల కారణంగానే.. సిగటోగా తెగులు వచ్చిందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఆ తెగులు వల్లే అరటి పండ్లు మాగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
సిగటోక తెగులు సోకిన పండ్లను స్థానిక మార్కెట్లో అయినా విక్రయిస్తే.. రైతులకు కొంతవరకైనా నష్టం తగ్గుతోంది. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మట్టి పాత్రల తయారీకి ‘కుంభార్ సశక్తీకరణ’.. తెలంగాణ వ్యాప్తంగా శిక్షణ