అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన కలకలం రేపింది. వేల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సాయిరాంపై ఓ మహిళ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకు ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడంలో వేల్ఫేర్ ఇన్స్పెక్టర్ పాత్ర కీలకం. పదవిని అడ్డుపెట్టుకుని ఇలాంటి పనులకు వచ్చే మహిళలను లోబరుచుకున్నారంటూ గత కొన్నేళ్లుగా సాయిరాంపై ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో రైల్వేలో పని చేసే ఓ ఉద్యోగి ఇన్ సర్వీస్‌లో మృతి చెందాడు. తన తండ్రి స్థానంలో ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. చివరికి లొంగదీసుకున్నాడు. ఆమెకు తెలియకుండా వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ చాలా కాలం కీచక పర్వాన్ని కొనసాగించాడు. గత సంవత్సరం వీరిద్దరి అభ్యంతరకర ఫోటో బయటకు రావడంతో ఉన్నతాధికారులు సాయిరాంను నాందేడ్‌కు బదిలీ చేశారు.
ఇంతలో మహిళా ఉద్యోగినికి జూన్ మాసంలో పెళ్లి కుదిరింది. తెలుసుకున్న సాయిరాం గుంతకల్లుకు బదిలీ చేయించుకుని.. మరోసారి ఆ మహిళను వేధించాడు. అప్పట్లో యువతితో ఉన్న వీడియోలను పెళ్లి వారికి పంపిస్తానని బెదిరించి ఆమెను మరోసారి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. వేధింపులు భరించలేని ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ.. గుంతకల్లు పోలీసులను ఆదేశించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు గుంతకల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి వెల్లడించారు. సాయిరాంను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇంత జరిగినా తనకేమీ తెలియదని సాయిరాం చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి: ఫేస్బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు..!