Severe Drought in Joint Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కరవు తాండవిస్తోంది. వర్షాభావ కారణంగా సుమారు 1.30 లక్షల హెక్టార్లలో భూములు బీడుగా మారాయి. దీంతో 63 మండలాలకు చెందిన రైతులు దిక్కుతోచక రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. నిధులు విడుదల చేసి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Severe Drought in Rayalaseema: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక కరవు తాండవిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి పంటలు వేసిన అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. రాయలసీమలో పరిస్థితి రోజు రోజుకు మరింతగా ఎక్కువవుతుంది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక పంటలన్నీ వెలవెలబోతున్నాయి. జలాశయాల కింద రెండు పంటలు సాగు చేసే మాగాణి భూములు కూడా నెర్రెలిచ్చాయి. దీంతో పంటలు నామరూపాల్లేకుండా ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం తాండవిస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 14 మండలాలను మాత్రమే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో రైతులు, రైతు సంఘాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం
Joint Anantapur Farmers Fire on YSRCP Govt: ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. తొలుత కురిసిన వానలకు అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా విత్తనాలు నాటారు. కానీ, తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. పంట కీలక దశలో ఉన్నపుడు చినుకు జాడ లేదు. దీనికి తోడు ఉన్న వర్షపు నీటిని జాగ్రత్తగా జలాశయాల్లో నిల్వ చేయాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం రైతులకు శాపంగా మారింది. నిధులు విడుదల కాక ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా కుంటుపడింది. దీంతో జలాశయాల్లోకి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా దిగువకు వృథాగా పోతోంది. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద వేల ఎకరాల్లో భూములు ఎండిపోయాయి.
Farmers, Tenant Farmers Tears: వర్షాభావంతో ఈ ఖరీఫ్‌లో లక్షా 30 వేల హెక్టార్లలో రైతులు ఏ పంట వేయకుండా వదిలేశారు. ఆముదం, కంది, వేరుశనగ వంటివి కొన్నిచోట్ల పచ్చగా కనిపించినా.. దిగుబడి 90 శాతం వరకు తగ్గింది. బోర్ల కింద సాగు చేసిన పంటలకు విద్యుత్తు సరఫరా సరిగా లేక పంటలకు తడులు అందలేదు. అరకొర కరెంట్‌తో వేలాదిగా వ్యవసాయ బోర్ల మోటర్లు కాలిపోయాయి. వర్షాధార భూముల్లో పంటలు సాగు చేసిన రైతులు, కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చేతికి రావాల్సిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే.. అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
Prathidhwani: కరవు, వలసలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..?
Farmers Demand Compensation: ఈ సారి రబీ సీజన్‌లో నల్ల రేగడి భూముల్లో వర్షాధార సాగుపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. పప్పుశెనగ, వాము, తృణధాన్య పంటలకు ఇప్పటికీ విత్తనం పడలేదు. చిన్నచినుకు పడినా పంట వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా వరుణుడు కరుణించటం లేదు. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోకుంటే.. తర్వాత సీజన్‌లోనూ సాగు కష్టమేనని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఇన్‌పుట్ రాయితీ, పంటల బీమా పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.